ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. 2020కి గానూ ప్రముఖ నటుడు రజనీకాంత్ కు వరించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం కేంద్రప్రభుత్వం అధికారిక ప్రకటన జారీ చేసింది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన నటుల జాబితాలో రజనీ ప్రధమ స్థానంలో ఉంటాడు. దేశంలో అత్యధిక పారితోషికం అందుకునే హీరోల జాబితాలోనూ తనదే అగ్రస్థానం. నటుడిగా, నిర్మాతగా, కథకుడిగా… రజనీ చిరస్మరణీయమైన విజయాల్ని అందుకున్నారు. తమిళ చిత్రసీమని అత్యంత ప్రభావితం చేసిన నటుడు.. రజనీ. 70 ఏళ్ల వయసులోనూ… అదే జోరు, అదే స్పీడు కొనసాగించడం మాటలు కాదు.
స్టైల్‌కి నిర్వచనం..
రజనీకాంత్. తన పేరు చెబితే చాలు అభిమానులకు పూనకాలు వచ్చేస్తాయి. అభిమానుల్ని భక్తులుగా మార్చుకున్న ఘనత తనది. ఓ సాధారణ వ్యక్తి.. సూపర్ స్టార్ గా మారడం వెనుక… బోలెడంత కష్టం ఉంది. రజనీకాంత్ అంటే.. స్టైల్ ఐకాన్ మాత్రమే కాదు. గొప్ప నటుడు కూడా. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన ప్రతీ సినిమా రజనీలోని నటుడ్ని 70 ఎం.ఎం.లో చూపించేదే. దళపతి లాంటి సినిమాల్లో సహజసిద్ధమైన నటనతో అలరించాడు రజనీ. రాజకీయాల్లోకి వస్తా.. వస్తా అంటూ… ఇటీవల ఊరించి ఊరించి ఉసూరుమనిపించడం ఒక్కటే ఆయన అభిమానులకు వెలితి. రాజకీయాల్లోకి రాకుండా ఆయన బీజేపీకి పరోక్షంగా సహాయం చేశాడంటూ కొంతమంది వాదిస్తుంటారు. ఇప్పుడు దాదా సాహెబ్ వచ్చిన సందర్భంగా ఆ నోళ్లకు మరింత పని దొరకబోతోంది. ఏదేమైనా ఈ అవార్డుకు రజనీ నూటికి నూరు శాతం అర్హుడు. కంగ్రాట్స్ టూ సూపర్ స్టార్.