హైకోర్టులో ఉన్న కేసుల్ని పట్టించుకోలేదు..! సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా లెక్కలోకి తీసుకోలేదు…! ముఖ్యమంత్రి జగన్ అనుకున్నట్లుగా ఆరు రోజుల్లో పరిషత్ ఎన్నికలు పూర్తి చేయడానికి ఎస్ఈసీ నీలం సాహ్ని ది బెస్ట్ అన్నట్లుగా ప్రయత్నించారు. కాకపోతే.. ఆరుకు బదులు ఎనిమిది రోజుల సమయం తీసుకున్నారు. ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే నీలం సాహ్ని పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఎక్కడ ఆగిందో ఎన్నికల ప్రక్రియ అక్కడ్నుంచే ప్రారంభిస్తారు. ఎనిమిదో తేదీన పోలింగ్ జరుపుతారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరం అయితే తొమ్మిదో తేదీన నిర్వహిస్తారు. పదో తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎంపికను చేపడతారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలను ఆరు రోజుల్లో పూర్తి చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఉదయం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత మాట్లాడిన జగన్.. ఆరు రోజుల డెడ్ లైన్నే చెప్పారు. గతంలో ఎప్పుడు పరిషత్ ఎన్నికల ప్రస్తావన వచ్చినా.. ఆరు రోజుల డెడ్ లైనే చెబుతూ వస్తున్నారు. ఓ రకంగా ఈ రోజే బాధ్యతలు తీసుకున్న ఎస్ఈసీకి ఇది సంకేతం అని అప్పుడే అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఉత్తర్వులు.. హైకోర్టులో విచారణలో పిటిషన్ వంటి అంశాలను చూస్తే..నోటిఫికేషన్ ఇవ్వడం ఆలస్యం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమయింది.
నీలం సాహ్ని ఉదయం బాధ్యతలు చేపట్టిన తర్వాత గవర్నర్ను కలిశారు. ఆ తర్వాత ప్రభుత్వ ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అయితే.. ఎన్నికల నిర్వహణపై ఏ విషయం తేల్చి చెప్పలేదు. హైకోర్టులో పరిషత్ ఎన్నికలు మొదటి నుంచి నిర్వహించాలన్న పిటిషన్ విచారణలో ఉంది. దానిపై మూడో తేదీన తీర్పు వచ్చే అవకాశం ఉందని.. ఆ తర్వాతే నోటిఫికేషన్ ఇస్తామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో అందరూ.. హైకోర్టు తీర్పు తర్వాతనే… నోటిఫికేషన్ వస్తుందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఎనిమిదిన్నర సమయంలో పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఎస్ఈసీ కార్యాలయం విడుదల చేసింది. దీంతో రాజకీయ పార్టీలు అవాక్కయ్యాయి.
మామూలుగా ఎన్నికల ప్రక్రియ రాష్ట్రం మొత్తం ఒక్కసారే పెట్టరు. పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా జరిగాయి. కానీ పరిషత్ ఎన్నికలు మాత్రం రాష్ట్రం మొత్తం ఒక్క సారే పెట్టేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం.. సాహ్ని ఉత్తర్వులు జారీ చేస్తున్నారని విపక్షాలు విమర్శలు చేయడం కామనే.