మామూలుగా అఖిలపక్షం భేటీ ఎందుకు నిర్వహిస్తారు..? ఓ నిర్ణయం తీసుకునే ముందు అందరి అభిప్రాయాలు తెలుసుకుని దాని ప్రకారం.. నిర్ణయం తీసుకోవడానికి పిలుస్తారు..? కానీ నీలం సాహ్ని స్టైలే వేరు. పరిషత్ ఎన్నికలపై నిర్ణయం తీసేసుకుని ఉత్తర్వులు ఇచ్చేసి.. తీరిగ్గా తర్వాతి రోజు అఖిలపక్ష భేటీకి పార్టీల్ని పిలిచారు. సంప్రదాయంగా…ఎవరైనా కొత్త ఎస్ఈసీ బాధ్యతలు చేపడితే ముందుగా రాజకీయ పార్టీలతో సమావేశం అవుతారు. అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. కానీ సాహ్ని మాత్రం… అలాంటి ప్రయత్నం చేయలేదు. కీలక నిర్ణయం ప్రకటించేశారు. తర్వాత అన్ని పార్టీల్ని సమావేశానికి ఆహ్వానించారు.
అయితే.. రాజకీయ పార్టీలన్నీ.. సాహ్నీ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రతినిధి వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. మిగతా పార్టీల ప్రతినిధులు ఎవరూ వెళ్లలేదు. ఎస్ఈసీ ఇలా ఏ పార్టీ విశ్వాసం లేకుండా ఎన్నికలు నిర్వహించడం ఇదే మొదటి సారి. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్వహించే సమావేశాలకు వైసీపీ తప్ప అందరూ హాజరయ్యేవారు. ఇప్పుడు సాహ్ని నిర్వహిస్తున్న సమావేశాలకు.. వైసీపీ తప్ప ఎవరూ హాజరు కావడం లేదు. మామూలుగా ఎన్నికల ప్రక్రియ రాష్ట్రం మొత్తం ఒక్కసారే పెట్టరు. పంచాయతీ ఎన్నికలు నాలుగు విడతలుగా జరిగాయి. కానీ పరిషత్ ఎన్నికలు మాత్రం రాష్ట్రం మొత్తం ఒక్క సారే పెట్టేస్తున్నారు.
విపక్ష పార్టీలు ఈ అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆరు రోజుల డెడ్ లైన్ పెడితే.. ఆ మేరకు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నారని.. రుణం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ రాజ్యాంగబద్ద పదవిలో ఉండి.. నిర్వర్తించాల్సిన విధులను మాత్రం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. నోటిఫికేషన్ విడుదల చేసి.. అఖిలపక్ష భేటీ పెట్టాల్సిన అవసరం లేదని.. ఇతర పార్టీలు స్పష్టం చేశాయి. కోర్టులను కూడా గౌరవించకుండా నిర్ణయాలు ప్రకటిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరేమనుకున్నా ఎస్ఈసీ మాత్రం…ఆలోచన చేసే అవకాశమే లేదని అంచనా వేస్తున్నారు.