వైఎస్ వివేకానందరెడ్డి కేసును వదిలేసుకోవాలని.. ఇంకా పట్టించుకుంటే ఆ ప్రభావం పిల్లలపై పడుతుందనే బెదిరింపులు వస్తున్నాయని వైఎస్ వివేకా కుమార్తె సునీత ఢిల్లీలో సంచలన ఆరోపణలు చేశారు. కడపలో ఇలాంటి హత్యలు సాధారణం అంటూ.. సీబీఐ అధికారులు వ్యాఖ్యానించారంటూ ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా కేసును ఎప్పటికీ తేల్చకపోతూండటంతో సునీతారెడ్డి.. ఢిల్లీలో సీబీఐ ఉన్నతాధికారుల్ని కలిశారు. ఆ తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య జరిగి రెండేళ్లు అయినా నిందితుల్ని ఇంత వరకూ పట్టుకోలేదని.. సాక్షులు రకరకాల కారణాలతో చనిపోతున్నారని.. కేసును వదిలేసుకోవాలని తనను బెదిరిస్తున్నారని ఆ ప్రభావం పిల్లలపై పడుతుందని కూడా అంటున్నారని.. ఇదేం పద్దతని ఆమె ప్రశ్నించారు. ఇంకా ఎంత మందిపై దాడులు జరుగుతాయోనని ఆమె ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
వివేకానందరెడ్డి మాజీ ముఖ్యమంత్రి సోదరుడని.. ప్రస్తుత ముఖ్యమంత్రి బాబాయ్ అని.. అయినప్పటికీ న్యాయం చేయకుండా… కడపలో హత్యలు సాధారణం అని చెప్పడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. హత్య కేసు విచారణ సరిగ్గా జరగడం లేదని.. ఎంత కాలం న్యాయం కోసం ఎదురు చూడాలని ప్రశ్నించారు. న్యాయం ఆలస్యం అవడం కూడా అన్యాయం చేయడమేనని ఆమె స్పష్టం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డికి శత్రువులు ఎవరూ లేరని రాజకీయ కారణంతోనే హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నానని.. సునీతారెడ్డి చెబుతున్నారు. ఎవరు ఎన్ని రకాలుగా సలహాలిచ్చినా.. తన మనసు న్యాయం కోసం పోరాడమనే సూచిస్తోందని… అందుకే.. తాను పోరాడుతున్నానన్నారు. దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేస్తేనే… వాస్తవాలు తెలుస్తాయని ఆమె అంటున్నారు. షర్మిల తన పోరాటం విషయంలో మద్దతుగా నిలిచిందని.. సునీత చెప్పారు. తప్పు జరిగిందని షర్మిలకూ తెలుసన్నారు.
వైఎస్ వివేకా హత్య కేసును హైకోర్టు సీబీఐకి ఇచ్చింది. సీబీఐ రెండు విడతలుగా వచ్చి విచారణ జరిపింది. కానీ ఏమీ తేల్చలేదు. ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా పరిస్థితి ఉంది. పైగా సీబీఐ అధికారులే హత్యలు కామన్ అన్నట్లుగా సలహాలిచ్చారని వైఎస్ సునీత చెప్పడం దిగ్భ్రాంతికి గురి చేసేలా ఉంది. ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ .. తన బాబాయ్ హత్యపై అనేక రకాల ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి అయి రెండేళ్లయినా కనీసం దర్యాప్తును ముందుకు వెళ్లనీయలేదు. చివరికి సునీత హైకోర్టుకు వెళ్లి సీబీఐ విచారణ కోసం పోరాడాల్సి వచ్చింది. ఇప్పుడు చెల్లెలకు న్యాయం చేయకపోగా.. ఆమెకు బెదిరింపులు వస్తున్నా… ఎలాంటి స్పందన లేకపోవడం… అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.