నాగార్జున సాగర్ ఉపఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది. బరిలో ఉన్న పార్టీలు బరిలో లేని పార్టీల మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కమ్యూనిస్టుల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందు కోసం లేఖలు కూడా రాశారు. అయితే వారు ఏ నిర్ణయం తీసుకోలేదు. అదే సమయంలో బీజేపీ .. జనసేన మద్దతు కోసం ప్రయత్నిస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీ కుమార్తెకు పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించి.. బీజేపీకి షాకిచ్చారు. గౌరవం లేని చోట తాము స్నేహం చేయబోమంటూ ఆయన తేల్చేశారు. అంటే బీజేపీతో పొత్తు లేదని చెప్పినట్లయింది. సాగర్ ఎన్నికల్లో ఎస్టీ అభ్యర్థిని నిలబెట్టాలని అనుకున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. కానీ పవన్ కల్యాణ్ ఆ దిశగా ముందడుగు వేయలేదు. దీంతో బీజేపీ ఊపిరి పీల్చుకుంది.
ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో మద్దతు ప్రకటన చేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ నేతలు .. ఇప్పటి వరకూ పవన్ తో సన్నిహితంగా ఉన్న దాఖలాలు లేవు. పవన్‌తో తనకు సాన్నిహిత్యం ఉందని బండి సంజయ్ చెప్పుకున్నా.. గ్రేటర్ ఎన్నికల సందర్భంగా అది తెగిపోయింది. దీంతో ఆయన నేరుగా వెళ్లి పవన్ కల్యాణ్‌ను మద్దతిమ్మని అడిగే అవకాశం లేదు. దీంతో ఢిల్లీ నేతలతో పవన్‌కు మద్దతుగా ప్రకటన చేయించాలని ఆలోచిస్తున్నారు. నాగార్జున సాగర్ నియోజవర్గం.. ఆంధ్ర బోర్డర్లో ఉంటుంది. అక్కడ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉంటారు.
నిజానికి అక్కడ బీజేపీ అభ్యర్థికి రెండు అంటే రెడు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. జనసేన పోటీ చేస్తే ఇంకా ఎక్కువ ఓట్లు సాధించడం ఖాయం. ఎలా చూసినా జనసేన మద్దతుదారుల బలం ఎంతో కొంత లభిస్తుంది. ఇప్పుడు బీజేపీకి అది అవసరం కూడా. మరి జనసేనానికి ఢిల్లీ నేతలు చెబితే.. మెత్తబడతారా.. లేకపోతే.. చివరికి మళ్లీ టీఆర్ఎస్కే మద్దతు పలుకుతారా.. అన్నది ఆసక్తికరంగా మారింది.