అనుకున్నట్లుగానే తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది. ఎన్నికలు ఏ మాత్రం ఫెయిర్‌గా జరిగే అవకాశం లేదని టీడీపీ నిర్ణయానికి వచ్చింది. బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని అక్రమాలు జరిగిన ఎన్నికలనే కొనసాగిస్తున్నారని .. అందుకే ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఆరు రోజుల్లో ఎన్నికలు జరపాలని సీఎం జగన్ అంటారని.. మంత్రులు తేదీలు ప్రకటిస్తారని … మండిపడ్డారు. గత ఎస్ఈసీకి ఎన్నికల నిర్వహణలో ఏ మాత్రం సహకరించని నీలం సాహ్ని ఇప్పుడు ఎస్ఈసీగా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని చంద్రబాబు ప్రశ్నించారు. పొలిట్‌బ్యూరో నిర్ణయం మేరకు ఎన్నికలను బహిష్కరిస్తున్నామని.. కఠిన నిర్ణయమే అయినా తప్పలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ఇరవై శాతానికిపైగా ఎన్నికలు పూర్తయ్యాయి. కడప లాంటి చోట్ల జడ్పీ పీఠం వైసీపీ పరం అయింది. ఎంపీటీసీల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ నామిషన్లపైనే.. గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల.. ఏకగ్రీవాలపై ఫిర్యాదులు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అయితే హైకోర్టులో ఆయనకు ఎదురు దెబ్బ తగిలింది. చివరికి ఆయన రిటైరయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియను కొత్త ఎస్ఈసీ నీలం సాహ్ని కొనసాగిస్తున్నారు. గతంలోనే చాలా చోట్ల ప్రత్యర్థులు బరిలో లేరు. ఇప్పుడు ఉంటారన్న ఆశ కూడా లేదు.
దీంతో ఏపీలో ఉన్న మండల, జిల్లా పరిషత్‌లన్నీ వైసీపీ అధీనంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. గతంలోనే చాలా చోట్ల.. బీజేపీ, జనసేన నేతలు కూడా నామినేషన్లు వేయలేకపోయారు. పోటీ నామమాత్రంగా ఉండనుంది. అయితే ఇప్పటికే నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో పోటీ మాత్రం జరగనుంది. పోలింగ్ కూడా ఉంటుంది. వైసీపీకి ఓటు వేయాలనుకునేవారు మాత్రమే ఓటు వేసే అవకాశం ఉంది. మొత్తంగా .. నిమ్మగడ్డ హయాంలో ఎన్ని ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలు వచ్చినా ఎన్నికల్లో పోరాడటానికే ప్రాధాన్యత ఇచ్చిన టీడీపీ.. నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టాక..ప్రతిపక్షాలకు కనీస ప్రజాస్వామ్య హక్కులు అయినా లభిస్తాయని నమ్మకం లేకపోయింది. అందుకే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారు.