పింక్ డైమండ్ పేరుతో శ్రీవారి ఆలయాన్ని రాజకీయంతో కలుషితం చేసిన రమణదీక్షితులు మళ్లీ.. శ్రీవారి సేవకు ప్రధాన అర్చకులుగా నియమితులయ్యారు. అప్పట్లో ఆ రాజకీయం చేసినందుకు ప్రతిఫలంగా మళ్లీ ప్రధాన అర్చకుని పదవి ఇస్తామని ఇచ్చిన హామీని వైసీపీ పెద్దలు రెండేళ్ల తర్వాత నెరవేర్చారు. రెండేళ్ల నుంచి రమణదీక్షితులు అనేక రకాలుగా ప్రభుత్వ పెద్దలకు విజ్ఞప్తులు చేస్తున్నారు… ట్విట్టర్లో అప్పుడప్పుడూ హెచ్చరికల్లాంటి వాటినీ పోస్ట్ చేస్తున్నారు. చివరికి ఇప్పటికి ఆయన ప్రయత్నాలు ఫలించాయి. ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి ఫలించింది. ఆయనను మళ్లీ ప్రధాన అర్చకులుగా విధుల్లో చేరేలా ఆదేశాలు జారీ చేసింది. ఆయనతో పాటు రిటైరైన వారందరూ విధుల్లో చేరనున్నారు.
గతంలో ప్రభుత్వంపై చేసిన పింక్ డైమండ్, పోటులో తవ్వకాలు సహా అనేక ఆరోపణలకు సంబంధించి టీటీడీనే స్వయంగా ఆయనపై రూ. వంద కోట్ల పరువు నష్టం దావా వేసింది. అది ఇంకా కోర్టులో పెండింగ్లోనే ఉంది. అయినప్పటికీ.. టీటీడీ అధికారులు రమణదీక్షితుల్ని విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించారు. రమణదీక్షితులు ప్రధాన అర్చకుని హోదాలో ఉండి… గత ఎన్నికలకు ముందు చెన్నై సహా వివిధ రాష్ట్రాలుతిరిగి.. వివాదాస్పద ప్రకటనలు చేశారు. వాటి ఆధారంగా అప్పటి టీడీపీ ప్రభుత్వంపై విపక్షాలు రాజకీయం చేశాయి. రమణదీక్షితులు జగన్ తో పాటు అనేక మందిని బహిరంగంగానే కలిశారు.
ఆ తర్వాత ప్రభుత్వం అర్చకులకు 65 సంవత్సరాల నిబంధనలను పెట్టింది టీటీడీ. అరవై ఐదేళ్లు దాటిన వారిని రిటైర్ చేసింది. కొత్తగా .. రిటైరయ్యే వారి కుటుంబసభ్యులనే నియమించారు. రమణదీక్షితులు కుమారుడు కూడా ప్రధాన అర్చకుల్లో ఒకరిగా నియమితులయ్యారు. అప్పట్లో టీటీడీ రిటైర్మెంట్ ఇచ్చేసిన విషయంపై తిరుచానురు అమ్మవారి ఆలయ అర్చకులు హైకోర్టును ఆశ్రయించగా….శ్రీవారి ఆలయ అర్చకులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో కేసు విచారణ దశలో వుంది. హైకోర్టులో మాత్రం తిరుచానూరు అమ్మవారి ఆలయ అర్చకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇదే తీర్పును తమకు అమలు చేయాలని….తమని విధుల్లో చేర్చుకోవాలని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు..చాలా కాలంగా కోరుతున్నారు. ఇప్పుడు టీటీడీ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో కేసు ఇంకా తేలలేదు.
అయితే రమణదీక్షితుల నుంచి ఒత్తిడి పెరగడంతో… ప్రభుత్వం నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఓ వైపు తిరుపతి ఉపఎన్నిక జరుగుతోంది. ఇలాంటి సమయంలో రమణదీక్షితులు.. వైసీపీకి వ్యతిరేకంగా ఏమైనా ప్రకటనలు చేస్తే.. హిందూ వ్యతిరేక ముద్ర మరింత బలంగా పడుతుందన్న ఉద్దేశంతో… హడావుడిగా ఉత్తర్వులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఈ నిర్ణయం .. టీటీడీలో మరింత గందరగోళం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.