జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న మాజీ ఐఏఎస్ రత్నప్రభ పవన్ కళ్యాణ్ కి రాఖీ కట్టి, పవన్ కళ్యాణ్ ని తమ్ముడు అంటూ సంబోధిస్తూ మాట్లాడడం బిజెపి జనసేన జైత్రయాత్ర సభలో హైలెట్ గా నిలిచింది. వివరాల్లోకి వెళితే..
జనసేన బిజెపి ఉమ్మడిగా నిర్వహించిన జైత్రయాత్ర సభలో మాట్లాడిన రత్నప్రభ , పవన్ కళ్యాణ్ పట్ల మీరు చూపిస్తున్న అభిమానం ప్రేమ చూసి నిజంగా దిమ్మ తిరిగి పోయిందని, బిజెపి జనసేన ఉమ్మడి జైత్రయాత్ర తిరుపతి పార్లమెంటు ఎన్నికల నుండే ప్రారంభం అవుతుందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తాను నలభై ఏళ్ల పాటు ఐఎఎస్ ఆఫీసర్ గా పని చేశానని, ఎక్కడకు వెళ్ళినా, అభివృద్ధి జరగని చోట్ల కూడా అభివృద్ధి జరిపి చూపించానని చెప్పుకొచ్చారు. తను ఎక్కడ పని చేసినా ఫైటర్ గా ఉన్నానని, దమ్ముంటే తనతో అభివృద్ధి పై చర్చ చేయాలని ఆవిడ అన్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, కనీసం బడ్జెట్ పెట్టడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదని, ఖజానా ఖాళీ చేశారని, మూడున్నర లక్షల కోట్లు అప్పు చేశారని, రాష్ట్రంలో పరిశ్రమలు రావడంలేదని, యువతకు ఉద్యోగాలు రావడం లేదని ఆవిడ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించారు. తనకు ఓటు వేస్తే ఆంధ్రప్రదేశ్ కు కొత్త దిశ చూపిస్తానని ఆవిడ అన్నారు. తన వెంట తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నారని ,అదే తన ధైర్యం అని ఆవిడ అన్నారు.
ఇక చివర్లో, కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అనే పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పి ఆయన అభిమానులను అలరించారు. ఆ తర్వాత వేదికపైనే పవన్ కళ్యాణ్ కు ఆవిడ రాఖి కట్టారు. మొత్తానికి మాట్లాడింది కాసేపే అయినప్పటికీ, రత్నప్రభ జనాల ని కన్విన్స్ చేసే లాగా మాట్లాడగలిగారు. జనసేన బిజెపి జైత్ర యాత్ర సభ తర్వాత బిజెపి నాయకత్వంలో విజయావకాశాలపై కాస్త నమ్మకం పెరిగినట్లుగా కూడా కనిపిస్తోంది. అది ఎంతవరకు నిజం అవుతుంది అన్నది తెలియడానికి మరి కొద్ది వారాలు వేచి చూడాలి.