కొత్త ఆర్థిక సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శుభారంభం కాలేదు. ఒకటో తేదీన జీతాలు అందలేదు. సాధారణంగా ఒకటో తేదీన బ్యాంకులు పని చేయవు అనుకుంటే రెండో తేదీన వస్తాయి.. అయితే ఈ ఏడాది రెండో తేదీన కూడా సెలవు. ఇక మూడో తేదీన వస్తాయేమో అని ఎదురు చూశారు. కానీ రాలేదు. ఏం జరిగిందో ఆరా తీస్తే .. అసలు జీతాల బిల్లులే ఇంత వరకూ ఆర్బీఐకి ప్రభుత్వం పంపలేదని తెలిసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హతాశులయ్యారు. సాధారణంగా హోమ్ లోన్ల ఈఎంఐలు.. ఇతరత్రా రుణాలు ఈఎంఐలు.. ఐదు నుంచి పదో తేదీ మధ్య ఉండేలా బ్యాంకులతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ తేదీలోపు జీతాలు.. రాకపోతే.. బౌన్స్ అవుతుంది. ఇప్పుడు ఉద్యోగులకు అదే టెన్షన్ ప్రారంభమయింది.
సాధారణంగా ప్రతీ నెల ఇరవై ఐదో తేదీలోపు జీతాల బిల్లులు సిద్ధమై.. ఆర్బీఐకి సమర్పిస్తారు. జీతాల చెల్లింపు చాలా పెద్ద ప్రాసెస్. ఇరవయ్యో తేదీ నుంచే ప్రారంభించాలి. ఈ సారి కూడా ప్రారంభించారు. అన్నీ రెడీ అయ్యాయి. కానీ ఆర్బీఐకి మాత్రం పంపలేదు. దీనికి కారణం… ఖజానాలో డబ్బుల్లేకపోవడమే. మార్చి నెలలో అప్పుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లభించలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు కావడం.. అప్పటికే భారీ ఎత్తున అప్పులుచేసి ఉండటంతో కుదరలేదు. అదే సమయంలో… ఆర్బీఐ బాండ్ల రుణాల చాన్స్ కూడా అయిపోయింది. మళ్లీ కొత్త ఏడాదిలోనే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో అప్పులు చేసి… జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ప్రస్తుతం అప్పుల కోసం ఆర్థిక శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అప్పు లభించగానే జీతాలు, పెన్షన్లు చెల్లిస్తారు.
ప్రస్తుత పరిస్థితి ప్రకారం.. ఎనిమిదో తేదీ తర్వాతనే జీతాల చెల్లింపు ప్రారంభమవుతుందని ఆర్థిక శాఖ వర్గాలు.. కొంత మంది ఉద్యోగ సంఘ నేతలకు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆర్థిక సమస్యలు కాకుండా.. టెక్నికల్ సమస్యలని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. పెన్షనర్లకు ఎప్పుడూ ఆలస్యంగానే పెన్షన్ అందుతోంది. గత నెలలో డీఏ బకాయిలు ఇస్తామని మున్సిపల్ ఎన్నికలకు ముందు ప్రకటించారు. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆర్థిక సంవత్సరం మారిపోయింది. ఇవ్వాలంటే మళ్లీ బిల్లులు పెట్టాలి.
ఇంత గడ్డు పరిస్థితి ఉన్నా.. రూ.పదకొండు వందల కోట్లబిల్లుల్ని సస్పెన్స్ ఖాతా నుంచి చెల్లించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయడమే ఇప్పుడు చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కూడా కాదని.. ఆ పదకొండు వందల కోట్లను ఎందుకు సస్పెన్స్ ఖాతాతో చెల్లించాలనుకుంటున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. అసలే ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సమయానికి జీతాలు, పెన్షన్లు ఇవ్వకపోతే… మరింత నెగెటివ్ ప్రచారం జరుగుతుంది. అయినప్పటికీ పట్టించుకోకుండా… ప్రభుత్వం సస్పెన్స్ ఖాతాతో అస్మదీయులకు బిల్లుల చెల్లింపునకు ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజల పన్నుల సొమ్మును సొంత సొమ్ముగా వినియోగిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి వస్తోంది.