ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహారశైలి .. ఆ పార్టీ నేతల్ని షాక్ కన్నా ఎక్కువగా విస్మయానికి గురి చేస్తోంది. టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి జరిగిందని తక్షణం కేసులు పెట్టాలని ఆయన ఏపీ ప్రభుత్వానికి ఓ లేఖరాశారు. ఆయన లేఖ రాయడమే ఆలస్యం..సీఐడీ కూడా కేసు నమోదు చేసింది. రెడ్డి ఎమ్మెల్యే అయిన మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు చేస్తేనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన సీఐడీ… సోము వీర్రాజు ఫిర్యాదు చేస్తే.. కేసు పెట్టకపోవడంలో వింత లేదు కానీ.. ఇక్కడ అసలు విషయం… సోము వీర్రాజు ఫిర్యాదు చేసింది… ఎవరిపైనా అని తరచి చూస్తే… బీజేపీ నేతలకూ తేడాగా అనిపిస్తోంది. సోము ఫిర్యాదు చేసింది.. సొంత పార్టీ నేత.. కామినేని శ్రీనివాస్ పైన.
టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య మంత్రిగా నాలుగేళ్లు బీజేపీ తరపున గెలిచిన కామినేని శ్రీనివాస్ మంత్రిగా ఉన్నారు. ఆయన చేతుల మీదుగానే వ్యవహారాలన్నీ నడిచాయి. ఇప్పుడు అదే శాఖపై ఆరోపణలు చేస్తూ సోము వీర్రాజు.. ప్రభుత్వానికి లేఖ రాసి.. కేసు నమోదవడానికి కారణంగా నిలిచారు. 2015 నుంచి వైద్య ఆరోగ్య శాఖ టెండర్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో దీనిపై అన్ని స్థాయిలలో ఫిర్యాదులు వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో దీనిపై విచారణ కూడా జరిగింది. అక్రమాలపై ప్రాథమిక నిర్ధారణ కూడా జరిగింది. తదుపరి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు సోము వీర్రాజు కదిలించారు.
టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నామని బీజేపీ నేతలు అనుకుంటూ ఉంటారు కానీ.. అది ఉమ్మడి ప్రభుత్వం అనే సంగతిని మర్చిపోతూ ఉంటారు. టీడీపీ మీద రాళ్లేస్తున్నామని అనుకుంటూ ఉంటారు కానీ.. తమ నేతలపైనే రాళ్లేస్తున్నామని మర్చిపోతున్నారు. మొత్తంగా సోము వీర్రాజు వ్యవహారశైలి తేడాగా ఉంది. ఆయన ప్రభుత్వంపై ఎక్కువగా విమర్శలు చేస్తే.. గతంలో దేవాదాయశాఖపై చేసేవారు. అప్పుడు మంత్రిగా ఉన్న మాణిక్యాలరావు కార్నర్ అయ్యేవారు. ఆయన కరోనాతో చనిపోవడంతో ఇప్పుడు ఆయనను సోము వీర్రాజు విడిచిపెట్టినట్లుగా ఉన్నారు. ఇప్పుడు కామినేని సంగతి చూస్తున్నారు. అయితే వైసీపీ పెద్దల నుంచి వచ్చిన సూచనల మేరకే.. సోము వీర్రాజులేఖ రాశారని..లేకపోతే… ఇప్పుడు లేఖ రాయాల్సిన సందర్భమే లేదని కొంత మంది గుర్తు చేస్తున్నారు. మొత్తానికి సోము.. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉండి..ఏ పార్టీ కోసం పని చేస్తున్నారో.. ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.