హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు పెట్టాలని కేటీఆర్ నేరుగా బీసీసీఐనే కోరారు. కానీ బీసీసీఐ పట్టించుకోలేదు. ఎంపిక చేసిన ఆరు వేదికల్లో హైదరాబాద్‌ను చేర్చలేదు. అయితే ఇప్పుడు బీసీసీఐనే బతిమాలి హైదరాబాద్‌లో ఐపీఎల్ పెట్టాల్సిన పరిస్థితి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఐపీఎల్ ప్రారంభోత్సవం జరగాల్సిన ముంబై వాంఖడే స్టేడియం సిబ్బందిలో పలువురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారు. పధ్నాలుగో తేదీన ప్రారంభోత్సవ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఓ వైపు వాంఖడే టెన్షన్ ఉండగా.. మరో వైపు మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. అక్కడ లాక్ డౌన్‌పై… నేడో రేపో నిర్ణయం తీసుకుంటామన్నట్లుగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తోంది.
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముంబైలో ఐపీఎల్ పెట్టడం సాధ్యమేనా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా అందరి చూపు హైదరాబాద్‌పై పడింది. హైదరాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నాయి. ఆటగాళ్లందరికీ సరిపడా ఆతిధ్యం ఇవ్వడానికి హోటళ్లుఉన్నాయి. అంతర్జాతీయ స్టేడియం ఉంది. సహకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్నింటి కంటే ఎక్కువగా… కరోనా తీవ్రత మరీ ఎక్కువగా ఏమీ లేదు. దీంతో హైదరాబాద్ విషయంలో బీసీసీఐ పెద్దల్లో ఆలోచన ప్రారంభమైనట్లుగా కనిపిస్తోంది.
అయితే కరోనా సెకండ్ వేవ్ ప్రభావం… ఈ సారి కాస్త ఎక్కువగానే ఉంది. ఐపీఎల్ లో పాల్గొంటున్న ఆటగాళ్లకు వైరస్ సోకుతోంది. ఢిల్లీ ఆటగాడు అక్షర్ పటేల్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. చెన్నై ఆటగాడు ఒకరికి కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ముందు ముందు ఇంకెంత మందికి పాజిటివ్ వస్తుందో తెలియని పరిస్థితి. ఈ తరుణంలో ఐపీఎల్ ప్రారంభమయ్యే వరకూ నిర్వహణ డౌటే అన్నట్లుగా పరిస్థితి మారుతోంది.