ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నప్పుడే.. మరి ఏఎన్నార్ బయోపిక్ మాటేమిటి? అనే ప్రశ్న మొదలైంది. వీరిద్దరూ… చిత్రసీమకురెండు కళ్లు. ఒకరి కథలో… మరొకరు తప్పకుండా ఉంటారు. అయితే ఎవరి జీవితం వాళ్లది, ఎవరి పోరాటం వాళ్లది. ఏఎన్నార్ చరిత్ర తెలియందేం కాదు. కానీ.. దాన్ని దృశ్య రూపంలో చూడాలన్నది సినీ అభిమానులు, అక్కినేని అభిమానుల ఆశ. ఎన్టీఆర్ బయోపిక్ సమయంలోనే ఏఎన్నార్ బయోపిక్ గురించి నాగార్జునని అడిగితే `అలాంటి ఆలోచన ఏదీ లేద`న్నాడు.
అయితే ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. `నాన్నగారి బయోపిక్ చేయాలన్న ఆలోచన ఉంది.. కానీ ఎప్పుడో చెప్పలేను` అని స్పష్టం చేశాడు నాగ్. “ఏమైనా తప్పులు చేస్తామేమో అన్న భయం ఆపుతోంది. `మనం` సమయంలోనూ ఇలానే భయపడ్డా. భయం ఎప్పుడైతే మొదలైందో, జాగ్రత్త పడడం నేర్చుకుంటాం. అప్పుడు తప్పకుండా మంచి ఫలితమే వస్తుంది. `మనం` సినిమానే అందుకు ఉదాహరణ“ అని చెప్పుకొచ్చాడు. సో… ఏఎన్నార్ బయోపిక్ ఉందన్నమాట. ఈ సినిమాపై ఆశలు పెట్టుకోవచ్చన్న సంకేతాల్ని నాగార్జున అభిమానులకు పంపినట్టైంది.