రెండు ఎమ్మెల్సీలు గెలిచిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్న పరిస్థితి ఉందని తరచూ వెలుగులోకి వస్తోంది. దీనికి మరో ఉదాహరణ వెలుగు చూసింది. సీఎం కేసీఆర్ బీసీ ల కోసం ఓ భారీ పథకం ప్రవేశ పెట్టబోతున్నారని మంత్రి గంగుల కమలాకర్ మీడియా ముఖంగా ప్రకటించారు. ఆపద్బంధు అని పథకం పేరు పెట్టారు. ఎంబీసీల్లో యువకులకు ఉపాధి కల్పిస్తారు. ఈ పథకం బీసీలపై చెరగని ముద్ర వేస్తుందని… టీఆర్ఎస్ ఓటు బ్యాంక్‌ను మరింత సంఘటితం ఆ పార్టీ నేతలు అంచనా వేసుకుంటున్నారు. అయితే… టీఆర్ఎస్లో మరో కీలక బీసీ నాయకుడు ఈటల రాజేందర్ మాత్రం.. విమర్శలు గుప్పించారు.
కులాల ప్రకారం.. నిధులు కేటాయించడం దుర్మార్గమని మండిపడ్డారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈటల డైరక్ట్‌గానే ఈ వ్యాఖ్యలు చేశారు. కులాల ప్రాతిపదికన రాజకీయాలు జరిగే దుర్మార్గపు ఆలోచనలో మార్పు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బీసీ పథకం… ఈటల విమర్శలు రెండూ ఒక్క సారే బయటకు రావడంతో టీఆర్ఎస్లో మరోసారి కలకలం బయలుదేరింది. నిజానికి ఈటల డైరక్ట్‌గా విమర్శించలేదు. కానీ టీఆర్ఎస్ పథకం వెలుగులోకి వచ్చినప్పుడే ఆయన … తాను పాల్గొన్న కార్యక్రమానికి సంబంధం లేకపోయినా ఘాటు విమర్శలు చేసి … ఏదో జరుగుతోందన్న అభిప్రాయాన్ని కల్పించారు.
ఈటల రాజేందర్ బీసీ వర్గాల్లో పలుకుబడి ఉన్న నేతగా ఉన్నారు. ఆయన పార్టీ పెడతారనే ప్రచారం ఉంది. ఆయనకు మద్దతుగా తెలంగాణలో చాలా గొంతులు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో… ఈటలకు చెక్ పెట్టడానికే కొత్త పథకం రూపుదిద్దారన్న అభిప్రాయం కూడా టీఆర్ఎస్లో ఉంది. ఒక వేళ ఈటల సొంత పార్టీతో నాయకుడిగా ఎదిగితే.. బీసీలంతా ఆయన వైపు పోకుండా ఈ పథకం ఉపయోగపడుతుందన్న అంచనాలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ విషయం ముందుగానే గుర్తించి… ఈటల వ్యూహాత్మకంగా.. పరోక్షంగా విమర్శలు గుప్పించారన్నచర్చ జరుగుతోంది. పరిస్థితి చూస్తూంటే.. టీఆర్ఎస్లో త్వరలో… పెద్ద కుదుపే రావడం ఖాయమన్న అంచనాలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి.