2019 పార్లమెంటు ఎన్నికలలో తిరుపతి స్థానం నుండి గెలిచిన వై ఎస్ ఆర్ సి పి అభ్యర్థి దుర్గాప్రసాద్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఉప ఎన్నికలలో వై ఎస్ ఆర్ సి పి తరఫునుండి గురుమూర్తి అనే ఫిజియోథెరపిస్ట్ పోటీపడుతుండగా, టిడిపి నుండి మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పోటీ చేస్తున్నారు. బిజెపి జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ రత్నప్రభ పోటీ చేస్తున్నారు. వీరి బలాబలాలు ఎలా ఉన్నాయి అన్న వివరాల్లోకి వెళితే..
2019 ఫలితాలు, ఓట్ల శాతం:
2019 ఎంపీ ఎన్నికలలో, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దుర్గాప్రసాదరావు ఏడు లక్షల ఇరవై రెండు వేల ఓట్లు అంటే దాదాపు 55 శాతం ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి రెండవ స్థానంలో నిలిచారు. సుమారు ఐదు లక్షల ఓట్లు అంటే దాదాపు 37 శాతం ఓట్లు సాధించారు. తదుపరి స్థానాలలో నోటా, కాంగ్రెస్, జనసేన మద్దతుతో నిలబడ్డ బిఎస్పీ, చివరి స్థానంలో బిజెపి అభ్యర్థులు నిలిచారు. ఒక్క వైయస్సార్ సిపి ,టిడిపి మినహాయించి, మిగతా ఎవరూ, రెండు శాతం ఓట్లు కూడా సాధించలేకపోయారు. ఈ కారణంతోనే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఉప ఎన్నికల్లో కూడా పనబాక లక్ష్మి కే టికెట్ ఇచ్చారు. అయితే ప్రచారంలో, పనబాక లక్ష్మి కాస్త వెనుకబడ్డట్టు కనిపిస్తోంది.
వైకాపా అభ్యర్థి గురుమూర్తి బలబలాలు:
సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గురుమూర్తి కి కాస్త అనుకూలత ఉంది. దీనికి తోడు తిరుపతి ఎంపీ నియోజకవర్గం కింద ఉన్న ఏడు ఎమ్మెల్యే స్థానాలు వై ఎస్ ఆర్ సి పి గెలుచుకుని ఉండడం, అందులో ఐదుగురు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు కావడం, వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థికి అనుకూలించే అంశాలు. అయితే రాజకీయాలకు కొత్త వాడు కావడం, జగన్ వద్ద పనిచేసిన ఫిజియోథెరపిస్ట్ అని తప్పించి మరే ఇతర క్వాలిఫికేషన్ లేకపోవడం తనకు ఒక మైనస్ గా ఉంది.
జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ బలాబలాలు:
జనసేన బిజెపి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న రత్నప్రభ నిన్న మొన్నటి వరకు డిపాజిట్లు తెచ్చుకోలేదు అన్నట్టుగా కనిపించినప్పటికీ, అనూహ్యంగా బిజెపి, తిరుపతి ఎన్నికను దుబ్బాక వలే ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, పవన్ కళ్యాణ్ పూర్తి మద్దతు ఇవ్వడం, సామాజిక సమీకరణాలు వీరికి అనుకూలంగా ఉండటం, ఆవిడకు పాజిటివ్ గా మారాయి. పైగా వై ఎస్ ఆర్ సి పి మరియు టిడిపి అభ్యర్థులు ఇద్దరు మాల సామాజిక వర్గానికి చెందిన వారు కాగా, బిజెపి వ్యూహాత్మకంగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి టికెట్ ఇచ్చింది. ఇది సోషల్ ఇంజనీరింగ్ పరంగా చూస్తే, బీజేపీ అభ్యర్థికి అనుకూలించే అంశమే. అయితే మాజీ ఐఏఎస్ అయినప్పటికీ రాజకీయాలకు కొత్త కావడం ఆవిడకు కొంత మైనస్ గా ఉంది.
టిడిపి అభ్యర్థి బలాబలాలు, రేసు లో పనబాక లక్ష్మి వెనుకబడిందా?
వీరితో పోలిస్తే రాజకీయాల్లో పనబాక లక్ష్మికి అపార అనుభవం ఉంది. ఆవిడ మాజీ కేంద్ర మంత్రి కూడా. అయితే గతంలో పదవులను అనుభవించిన కారణంగా, కేంద్ర మంత్రిగా పదవి లో ఉన్న ఆ సమయంలో ఆవిడ పెద్దగా చేసిందేమీ లేదు అనే ప్రచారం స్థానికంగా బలంగా ఉంది. పైగా ఇది కేవలం ఉప ఎన్నిక కావడం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి టీడీపీకి సఖ్యత లేకపోవడం వంటి కారణాల వల్ల ఆవిడ వైపు నుండి కూడా ఎంపీ స్థానం గెలిచి తీరాలన్న పట్టుదల కనిపించడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. వ్యక్తిగతంగా ఆవిడవైపు నుండి ఈ మైనస్ పాయింట్లు వుండగా, టిడిపి పార్టీ తరపునుండి కూడా కొన్ని పాయింట్స్ పనబాక లక్ష్మికి మైనస్ గా మారాయి.
ఇటీవల, పరిషత్తు ఎన్నికలను బహిష్కరించాలని కార్యకర్తలకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు కూడా క్యాడర్ కు తప్పుడు సంకేతాలను ఇచ్చింది. ఇంతే కాకుండా పనబాక లక్ష్మి కోసం ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ప్రచారంలో పాల్గొన లేదు. మొత్తం భారాన్ని అచ్చెన్నాయుడు వంటి నేతలపై చంద్రబాబు నాయుడు వేశారన్న అభిప్రాయం టిడిపి క్యాడర్ లో వినిపిస్తోంది. సొంత జిల్లాలో టిడిపి ఎంపీ అభ్యర్థి ప్రచారానికి చంద్రబాబు నాయుడు పాల్గొనకపోతే అది దుష్ఫలితాలను ఇస్తుందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వెలిబుచ్చుతున్న అభిప్రాయాలు టీడీపీ అధిష్టానానికి వినిపిస్తున్నాయా అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.
ఒకవైపు వైఎస్ఆర్సిపి తరఫునుండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి నేతలు ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలకు విడివిడిగా బాధ్యతలు ఇచ్చి గెలుపు కోసం పని చేస్తూ ఉన్నారు. పైగా రాష్ట్ర మంత్రులు కొందరికి తిరుపతి ఉప ఎన్నిక గెలిపించే బాధ్యత కూడా ఇచ్చి ఉన్నారు. మరొక వైపు బిజెపి తరఫున సునీల్ దియోధర్ ఆరు నెలల నుండి తిరుపతిలోనే మకాం వేసి, పోలింగ్ బూత్ లెవెల్ డేటా తెప్పించుకుని సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. జనసేన కు అనుకూలంగా ఉండే సామాజిక వర్గాల నేతలతో విడివిడిగా సమావేశమయ్యారు. ఇలా వైఎస్ఆర్సిపి మరియు బిజెపి రకరకాల వ్యూహాలతో ముందుకు పోతూ ఉండగా, టిడిపి పూర్తిగా క్యాడర్ ని నమ్ముకుని ఎన్నికలకు వెళ్తుంది. క్యాడర్ పై నమ్మకం ఉంచడం సమంజసమైనదే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సరైన వ్యూహం కొరవడితే, టిడిపి అభ్యర్థి గెలవడం అటుంచి మూడో స్థానానికి పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది.
ప్రస్తుత పరిస్థితి వరకు చూస్తే వైఎస్ఆర్సిపి బిజెపి అభ్యర్థుల మధ్య పోటీ బలంగా కనిపిస్తోంది. అయితే మరో రెండు వారాలపాటు సమయం ఉన్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబునాయుడు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో సరైన వ్యూహం తో ముందుకు వస్తారా, లేక అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారా అన్నది వేచి చూడాలి.
– Zuran