పవన్ కల్యాణ్ `వకీల్ సాబ్`పై అందరి దృష్టీ పడింది. ఈనెల 9న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకున్న హైప్ ని బట్టి చూస్తే, సినిమా ఎలా ఉన్నా, తొలి మూడు రోజుల్లోనే రికార్డు స్థాయి వసూళ్లు అందుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నిడివి గురించి రకరకాల వార్తలొస్తున్నాయి. సినిమా లెంగ్తీగా ఉందని, ఈ విషయంలోనే చిత్రబృందం టెన్షన్ పడుతుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాలుగా తేలింది. స్టార్ హీరో సినిమా ఈమాత్రం నిడివి ఉంటే పెద్ద ఇబ్బందులేం ఉండవు.
ఇదే సమయంలో పవన్ స్క్కీన్ టైమ్ పై కూడా ఇప్పుడు చర్చ మొదలైంది. సినిమా మొత్తమ్మీద పవన్ ఎంత సేపు కనిపిస్తాడన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఎట్టకేలకు తేలిందేంటంటే.. ఈ సినిమాలో పవన్ స్క్రీన్ టైమ్ 50 నిమిషాల లోపేనట. ఇది ముగ్గురు అమ్మాయిల కథ. ఎక్కువ భాగం వాళ్ల చుట్టూనే నడుస్తుంది. `పింక్`లోనూ అంతే. అమితాబ్ సినిమా ప్రారంభమైన చాలాసేపటి వరకూ రాడు. అయితే `వకీల్ సాబ్`లో పవన్ కోసం కొన్ని కొత్త సీన్లు రాసుకున్నారు. ఫ్లాష్ బ్యాక్, అందులో ఓ పాట, ఫైటూ అంటూ ఆ పాత్ర నిడివి పెంచారు. కాబట్టే.. స్క్రీన్ టైమ్ ఎక్కువ ఉంటుందని భావించారంతా. అయితే.. ఇన్ సైడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం.. పవన్ కేవలం 50 నిమిషాలే కనిపించబోతున్నాడని తేలింది. అయితే… పవన్ కల్యాణ్ తెరపైకొచ్చినప్పుడల్లా… ఆయన అభిమానులకు పూనకాలు తెచ్చేలా సీన్స్ ఉంటాయని, ముఖ్యంగా ఇంట్రడక్షన్ సీన్, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం, ఫైట్లూ… ఫ్యాన్స్కి నచ్చేలా ఉంటాయని సమాచారం. ఈ సినిమా కోసం పవన్ 50 కోట్ల పారితోషికం తీసుకున్నాడని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. 50 నిమిషాల కోసం 50 కోట్లంటే.. నిమిషానికి కోటి రూపాయలన్నమాట.