రాజకీయాల్లో కొన్ని ఆసక్తికరపరిణామాలు ఎందుకు జరుగుతున్నాయో… అంచనా వేయడం కష్టం. అలాంటి వాటిలో ఒకటి… రాయలసీమకు చెందిన షర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసి.. రాజన్న రాజ్యం తీసుకు వస్తామని ప్రకటించడం. తెలంగాణకు బద్ద వ్యతిరేకి అయిన వైఎస్ కుమార్తె అంత దర్జాగా తెలంగాణలో రాజకీయం చేయగలగడమే ఓ విశేషం అయితే.. ఎంతో పట్టు ఉన్న ఏపీలో కాకుండా… తెలంగాణకు ఎందుకు వచ్చిందన్నది మరో ప్రశ్న. వీటన్నింటికీ రకరకాల సమాధానాలు వస్తూ ఉంటాయి. కానీ క్యాచీగా ఉండేవి మాత్రం కొన్నే. అన్నతో విబేధించి.. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టిందని చాలా మంది చెబుతూ ఉంటారు కానీ.. అన్నతో విబేధిస్తే… ఏపీలో పెట్టుకోవాలి కానీ తెలంగాణలో పెట్టుకుంటారా అన్నది ప్రధానమైన సందేహం.
ఈ చర్చల్లోకి జనసేన నేత పోతిన మహేష్ అంశం తీసుకు వచ్చారు. అసలు షర్మిల తెలంగాణకు ఎందుకు వచ్చారంటే… జగన్మోహన్ రెడ్డి ఆస్తులన్నీ పంచేశారని…అందులో భాగంగా ఏపీని .. తనకు అంటే… జగన్‌కు.. తను జైలుకెళ్తే భారతికి వదిలేయాలని… షర్మిలకు తెలంగాణ అప్పగించాలని ఒప్పందాలయ్యాయట. ఈ విషయాన్ని పోతిన మహేష్ చెబుతున్నారు. నిజంగా అంతర్గత సమాచారం అందిందో లేదో .. పవన్ కల్యాణ్‌ను.. అదే పనిగా వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని ఇలా కౌంటర్ ఇచ్చారో కానీ… ఇదేదో లాజికల్‌గానే ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
జగన్‌తో విబేధాలు వస్తే షర్మిల అన్నకు వ్యతిరేకంగా మాట్లాడాలి. కానీ ఇక్కడ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. ఆస్తుల పంపకం గురించి కూడా ఆమె ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదు. మొత్తంగా చూస్తే.. ఆస్తుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వివాదాలు రాకుండా సెటిల్ చేసుకున్నారని.. రాజకీయ పరంగా.. .వైసీపీలో చోటివ్వడం కష్టం కాబట్టి.. తెలంగాణ రాసిచ్చేశారని.. భవిష్యత్‌లో అక్కడ.. వైసీపీ అడుగు పెట్టబోదని హామీ ఇచ్చి పంపించారని అంటున్నారు. పంపకాల్లో భాగంగా పెద్ద ఎత్తున మనీ రావడంతోనే.. వైసీపీ తరహాలో రాజకీయాలను షర్మిల చేస్తున్నారంటున్నారు. పార్టీలో చేరే కొంత మంది ప్రముఖ నేతలకు ఆర్థిక సాయం ఆఫర్ చేస్తున్నారన్న చర్చ ఇప్పటికే తెలంగాణలో జరుగుతోంది.