టాలీవుడ్ లో ఈమధ్య గట్టిగా వినిపిస్తున్న సంగీత దర్శకుడి పేరు.. గోపీ సుందర్. తన ఆల్బమ్ అంటే.. ఖచ్చితంగా మెలోడీల మణిహారమే. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్`కీ తనే సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆల్బమ్ నుంచి వచ్చిన పాటలన్నీ బాగా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా `ఏజీందగీ` అనే పాటని విడుదల చేశారు. హీరో, హీరోయిన్ల మధ్య సాగే రొమాంటిక్ మాంటేజ్ గీతం ఇది. రామజోగయ్య శాస్త్రి రాసిన పాటకు…హనియా నఫీసా, గోపీ సుందర్ గాత్రదానం చేశారు. ఈ లిరికల్ వీడియోని కట్ చేసిన విధానం కూడా బాగుంది.
`ఆర్ యూ రెడీ ఫర్ డ్రైవ్ విత్ అజ్` అంటూ… అఖిల్ ఓ కారులో, పూజా మరో కారులో లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నట్టు… వీడియో షూట్ చేసి, దాన్ని ఈ లిరికల్ వీడియోకి కలిపారు. మరో కారులో… బొమ్మరిల్లు భాస్కర్, గోపీ సుందర్ తో పాటు, గాయనీ గాయకులు కూడా… లాంగ్ డ్రైవ్ కి బయర్దేరడం ఈ పాటలో కనిపిస్తుంది.
ఎప్పటిలా రామ జోగయ్య శాస్త్రి కలం నుంచి మంచి పదాలు పడ్డాయి. లిరిక్ చాలా సింపుల్ గా, ట్యూన్ హాంటింగ్ గా సాగింది.
ఆకాశమంతా ఆనందమై
తెల్లారుతోంది… నా కోసమై
ఆలోచనంతా ఆరాటమై
అన్వేషిస్తోంది… ఈ రోజుకై
అంటూ మొదలైన ఈ పాటలో…
కాలాలు పరుగయ్యేలా
ప్రాణాలు వెలుగయ్యేలా
ఓ తోడు దొరికెనేడు … తనలాగా…
నా పెదవంచుకు తన పేరు తోరణం..
నా చిరునవ్వుకు తనేగా కారణం.. – అనే మాటలు ఆకట్టుకుంటాయి. మొత్తానికి గోపీ సుందర్ నుంచి వచ్చిన మరో మెలోడీ ఇది. కొన్నాళ్ల పాటు హాయిగా పాడుకోవొచ్చు. వినొచ్చు.