అదానీ అంధ్రప్రదేశ్ పోర్టుల్లో .. ఆంధ్రప్రదేశ్ వారికి ఒక్క శాతం వాటా కూడా ఉండకూడదని అనుకుంటున్నారేమో కానీ… ఇలా ఆఫర్స్ ఇచ్చి.. అలా పోర్టుల్ని కొనేస్తున్నారు. కృష్ణపట్నం పోర్టులో గతంలోనే 75 శాతం వాటా కొనుగోలు చేసిన అదానీ.. తాజాగా మరో ఇరవై ఐదు శాతం వాటాను కూడా కొనేశారు. ఇప్పటి వరకూ ఇరవై ఐదు శాతం వాటా … విశ్వసముద్ర హోల్డింగ్స్ అనే కంపెనీ వద్ద ఉంది. రూ.2, 800 కోట్లు ఇచ్చేసి.. ఆ వాటాలను అదానీ గ్రూప్ కొనేసింది. దీంతో ఇప్పుడు వంద శాతం పోర్టు అదానీ పోర్టుగా మారిపోయింది. ఇప్పుడు కృష్ణపట్నం పోర్టు విలువ రూ.13,675 కోట్లు అని అదానీ గ్రూప్ క్లెయిమ్ చేసుకుంది.
డీప్ వాటర్ పోర్టు అయిన కృష్ణపట్నం భారీ లాభాల్లో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం పదమూడు వందల కోట్ల వరకూ లాభాన్ని ఆర్జిస్తుందన్న అంచనాలున్నాయి. ఏపీలోని పోర్టులపై అదానీ పట్టు బిగుస్తోంది. కొద్ది రోజుల కిందటే.. గంగవరం పోర్టులో అత్యధిక వాటాను కొనుగోలు చేసింది. మిగతాది కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. అత్యంత విశాలమైన తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో పోర్టులు అతి పెద్ద వ్యాపార అవకాశాలుగా ఉన్నాయి. వీటిని గతంలో వినియోగించుకుని రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెట్టిన వ్యాపారవేత్తలు ఇప్పుడు.. వాటిని అదానీకి సమర్పించుకుంటున్నారు.
నష్టాలొచ్చి అమ్ముకుంటే.. ఓ లెక్క అనుకోవచ్చు. కానీ గంగవరం కానీ.. కృష్ణపట్నం కానీ భారీ లాభాల్లో ఉన్నాయి. క్యాష్ రిజర్వులు ఉన్నాయి. అయినప్పటికీ.. వారు అదానీకి పోర్టులు సమర్పించేసుకుంటున్నారు. తెర వెనుక ఏం జరుగుతుందో కానీ.. కొన్నాళ్ల తర్వాత ఏపీ తీరం అంతా గుజరాత్ పరం అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న వాదన వినిపిస్తోంది.