వైఎస్ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని.. తెచ్చేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని.. వైఎస్ విజయా రాజశేఖర్ రెడ్డి పేరుతో విడుదలైన ఓ లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ లేఖ మొత్తం చదివిన తర్వాత ఎవరికైనా.. జగన్మోహన్ రెడ్డి క్యాజువల్‌గా మాట్లాడే మాటలను వినేవారికి.. ” అరె.. ఇది అచ్చంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే లాంగ్వేజ్‌లో ఉందే..” అని అనిపిస్తే.. అది వారి తప్పు కాదు. ఎందుకంటే.. ఆ లేఖ మొత్తం జగన్మోహన్ రెడ్డి నేరుగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఈ లేఖ విజయలక్ష్మి రాసినట్లుగా ముందుగా సాక్షిలోనూ.. తర్వాత వారి అనుకూల మీడియాలోనూ హైలెట్ చేశారు. ఇంతా చేసి ఆ లేఖపై.. విజయా రాజశేఖర్ రెడ్డి చేవ్రాలు లేదు. దీంతో ఆ లేఖపై వైసీపీలోనే చర్చ ప్రారంభమయింది.
వైఎస్ కుటుంబంలో గొడవలు అని… ఆంధ్రజ్యోతినో.. ఈనాడునో… లేకపోతే… వైఎస్ ఫ్యామిలీ అంటే పడని మరో మీడియానో చెబితే.. గొడవలు జరిగిపోవుగా..!?. కుటుంబంలో అంతా బాగుంటే… ఎప్పటికీ బాగుంటుంది. ఆయా మీడియా వీరి కుటుంబ వ్యతిరేకులని తెలుసు కాబట్టి ఎవరూ ట్రాప్‌లో పడరు . కానీ ఓ చెల్లి ఢిల్లీలో ప్రెస్మీట్లు పెట్టి.. తన అన్యాయం జరిగిందని.. న్యాయం కావాలని గొంతెత్తి అరుస్తున్నారు. మరో చెల్లి.. తనకు పార్టీలో ప్రాధాన్యత ఎందుకివ్వలేదో… జగన్నే అడగాలని చెబుతున్నారు. ఆమె సొంత కుంపటి పెట్టుకోవడం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. వైఎస్ వివేకా వర్థంతిక ఎవరూ వెళ్లలేదన్నది నిజం. ఇన్ని కళ్ల ముందు కనిపిస్తున్నా… అలవాటయిన పద్దతిలో చంద్రబాబు మీద తోసేసి… కప్పి పుచ్చుకోవాలనుకోవడం ఏమిటో… చాలా మందికి అర్థం కాని విషయం.
వైఎస్ వివేకా హత్య కేసుపై పవన్ కల్యాణ్ విమర్శలు చేశారంటూ… విజయా రాజశేఖర్ రెడ్డి గింజుకున్నారు. నిజానికి ఆ విమర్శలు పవన్ కల్యాణ్ చాలా లేటుగా చేశారు. చాలా కాలం నుంచి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత చేస్తున్నారు. సీబీఐ విచారణ కోసం కోర్టుకెళ్లినప్పుడు… ఆమెకు ఎందుకు న్యాయం చేయలేదు..?. పదవిలోకి వచ్చాక తొమ్మిది నెలల పాటు..,. ఎందుకు విచారణ జరగనీయలేదో.. ఆమెకు తెలుసు కాబట్టే…సీబీఐ కోర్టుకు వెళ్లారు. కుటుంబంలో విబేధాలను.. గొడవలను.. ప్రతిపక్ష పార్టీలు.. సమాచారం ఇచ్చే మీడియాపై తోసిసి.. నాలుగైదు పేజీలను లేఖ రూపంలో రాస్తే అంతా మాఫీ అయిపోవని… కుటుంబంలో గొడవలకు కారణం ఏమిటో తెలుసుకుని పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తే… పరిస్థితి మెరుగుపడుతుందని.. కొంత మంది సలహాలిస్తున్నారు. అలా కాకుండా నచ్చని మీడియాపైన.. చంద్రబాబుపైన నిందలేసి.. రాజకీయం చేసుకుంటే.. కుటుంబం కూడా రాజకీయం అయిపోతుందని గుర్తించాలని అంటున్నారు.