తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు ప్రక్షాళన సమయం నడుస్తున్నట్లుగా ఉంది. త్వరలో ఆరుగురు సీనియర్లు శాసనమండలి నుంచి రిటైర్ కాబోతున్నారు. కేసీఆర్ వారికి మళ్లీ చాన్సిచ్చే అవకాశాలు చాలా స్వల్పమేనని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక గవర్నర్ కోటా స్థానంతో పాటు మరో ఆరు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీస్థానాలు జూన్‌లో ఖాళీ అవుతున్నాయి. గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, కడియం శ్రీహరి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఫరీదుద్దిన్, ఆకుల లలిత ఈ ఆరుగురు. వీరిలో అందరూ ఫిరాయింపుల ద్వారా బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్లోకి వచ్చిన వారే. అప్పట్లో పార్టీ అవసరాల కోసం వీరిని తీసుకుని మళ్లీ పదవి ఇవ్వడం చేసి ఉంటారని.. ఈ సారి మాత్రం ఉద్యమకారులకు చాన్సిస్తారని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.
గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోసారి ఎమ్మెల్సీ ఇవ్వకపోవచ్చని టీఆర్ఎస్లో గట్టి ప్రచారం జరుగుతోంది. శాసనమండలి చైర్మన్‌గా పీవీ కుమార్తె పేరును ఇప్పటికే ప్రచారంలో పెట్టడమే దీనికికారణం. అలాగే కడియం శ్రీహరి కి కూడా ఈ సారి చాన్సివ్వరని వచ్చే ఎన్నికల్లో పోటీకి టిక్కెట్ ఇస్తామన్న హామీతో సరి పెడతారని అంటున్నారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన సమయంలో అగ్ర తాంబూలం దక్కింది కానీ.. తర్వాత ఆయన పరిస్థితి దిగజారిపోతూ వస్తోంది. త్వరలో ఆయన ఎమ్మెల్సీ కూడా కాకుండా టీఆర్ఎస్ నేతగా మిగిలిపోనున్నారని అంటున్నారు. ఆకుల లలిత కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా గెలిచి .. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. ఓడిపోయి టీఆర్ఎస్లో చేరారు. ఆమెకు ప్రాధాన్యం ఇస్తే ఇతర నేతలకు అసంతృప్తి పెరుగుతుంది. అందుకే కేసీఆర్ ఆమెకు చాన్సిచ్చే అవకాశాల్లేవంటున్నారు.
ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు రేసులో చాలా మంది ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి..దేశపతి శ్రీనివాస్. ఆయన పేరు చాలా సార్లు ప్రచారంలోకి వచ్చినా ఇవ్వలేదు. మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ ఉద్యోగ సంఘం నేత దేవీ ప్రసాద్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, గుండు సుధారాణి, తుమ్మల నాగేశ్వర్రావు, బొంతు రామ్మోహన్.. ఇటీవలే ఎమ్మెల్సీ హామీ పొందిన సాగర్ నేత కోటిరెడ్డి.. లాంటి వాళ్లు చాలా మంది రేసులో ఉన్నారు. ఎంత మంది సీనియర్లకు చాన్సివ్వాలి.. ఎంత మంది కొత్త వారికి చాన్సివ్వాలి అనేది.. ఇప్పుడు కేసీఆర్ ముందున్న టాస్క్. ఈ సారి ఎమ్మెల్సీల ఎంపిక కాస్తంత క్లిష్టమే.