భారత అత్యున్నత న్యాయపీఠంపై తెలుగు తేజం జస్టిస్ నూతల పాటి వెంకటరమణ ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే ఈ మేరకు సీజేఐ బోబ్డే చేసిన సిఫార్సు కేంద్ర న్యాయశాఖ నుంచి రాష్ట్రపతికి వెళ్లింది. రాష్ట్రపతి ఆ నియామకంపై ఆమోదముద్ర వేసి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రపతికి బైపాస్ సర్జరీజరగడంతో కొంత ఆలస్యం అయింది. లేకపోతే ఇప్పటికే ఉత్తర్వులు వెలువడి ఉండేవి. ఇరవై మూడో తేదీన ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే పదవీ విరమణ చేస్తారు. ఇరవై నాలుగో తేదీ నుంచి సీజేఐగా జస్టిస్ వెంకటరమణ వ్యవహరిస్తారు.
న్యాయనిపుణుడైన జస్టిస్ ఎన్వీ రమణ.. కృష్ణా జిల్లాలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. లా చదవి… ప్రాక్టీస్‌లో తనదైన ముద్ర వేశారు. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్‌లో నియమితులయ్యారు. అనంతరం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. వచ్చేఏడాది ఆగస్టు 26 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఆ తరవాత రిటైరవుతారు.
సీజేఐగా నియమితులయ్యే రెండో వ్యక్తి ఎన్వీ రమణ. జస్టిస్ కోకా సుబ్బారావు 1966-1967 మధ్య కాలంలో సీజేఐగా వ్యవహరించారు. ఆ తర్వాత మరో తెలుగు న్యాయనిపుణుడు సీజేఐ స్థాయికి వెళ్లడం ఇదే మొదటి సారి. ఇప్పటికే ఎన్వీ రమణ సీజేఐ కాకుండా ఆయనపై చాలా ఆరోపణలు చేశారు. వాటన్నింటినీ విచారించిన సుప్రీంకోర్టు.. డిస్మిస్ చేసింది.