ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో దొరికిన దగ్గరల్లా అప్పులు చేయడం సాధ్యం కాదు. ఇచ్చేవారున్నా తీసుకోలేరు. ఎందుకంటే.. కేంద్రం అప్పుల పరిమితి విధించింది. చాలా స్పష్టంగా హెచ్చరికలతో కూడిన లేఖను ఏపీ ఆర్థిక శాఖకు పంపించింది. ఆ లెక్క ప్రకారం.. ఈ ఏడాది ఏపీ సర్కార్ తీసుకోగలిగిన అప్పు రూ. 42, 472 కోట్లకు మాత్రమే. ఇది కేవలం ఆర్బీఐ నుంచి బాండ్ల రూపంలో తీసుకునే అప్పు మాత్రమే కాదు. అన్ని రకాల రుణాలు కూడా ఈ మొత్తంలోకి వస్తాయి. బ్యాంకులు.. ప్రైవేటు సంస్థలు.. నాబార్డు…పీఎఫ్,చిన్న మొత్తాల పొదుపు ఇలా..అన్ని రుణాలు కలిపి… రూ. 42, 472 కోట్లకు మించి అప్పు చేయకూడదు. ఇందులోనూ ట్విస్ట్ ఉంది. తీసుకున్న అప్పులో ఖచ్చితంగా రూ. 27, 589 పెట్టుబడి వ్యయం చేయాలని కేంద్రం తేల్చేసింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది.
గత ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలను ఏపీ సర్కార్ అప్పుగా తెచ్చింది. కరోనా పరిస్థితులు కూడా కలిసి వచ్చాయి. పొలాల్లో విద్యుత్ మీటర్లు బిగించడం వంటి సంస్కరణలకు పాల్పడటం ద్వారా.. మరికొన్నిరుణాలకు వెసులు బాటు తెచ్చుకున్నారు. మద్యం ఆదాయం.. పెట్రోల్ పై ట్యాక్స్ .. ఇలా ప్రతీ ఆదాయాన్ని బ్యాంకుల వద్ద.. ఆర్థిక సంస్థల వద్ద తాకట్టు పెట్టి.. రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలన్నీ ఖర్చయిపోయాయి. ఏమైపోయాయో తెలియదు కానీ ఇప్పటికీ.. రూ. లక్ష కోట్ల వరకూ పెండింగ్ బిల్లులుఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో రుణాలు తీసుకుని సర్దుబాటు చేయాలని అనుకున్నారు. కానీ మొదట్లోనే షాక్ తగిలింది.
జీతాలు, పెన్షన్లకు కూడా అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి.. పరిమితంగా అప్పు వస్తే బండి నడవడం కష్టం అవుతుంది. తెచ్చుకునే అప్పుల్లోనూ పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉండాలని చెప్పడం కూడా ఏపీ సర్కార్కు మరింత ఇబ్బందికరమే. సంపదను అమ్మేసి.. అప్పులు చేసి.. వచ్చే ఆదాయం కూడా.. కలిపి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పంచి పెడుతున్నారు. అలా పంచి పెట్టడం.. మూలధన వ్యయం కాదు. అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడమే పెట్టుబడి వ్యయం. అలా ఖర్చు పెడితే..సంక్షేమ పథకాలకు పంచడానికి రూ. పదివేల కోట్లు కూడా మిగలవు. ఇప్పుడు… అసలు సమస్య ప్రారంభమవుతుంది.
గత ఏడాది.. అంతకు ముందు చేసిన అప్పుల కోసం… వాయిదాల చెల్లింపు ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత పెరగనుంది. ఓ వైపు అప్పులు చేస్తూ.. పాత అప్పులు తీరుస్తూ… ఆర్థిక వ్యవస్థను మరింత జాగ్రత్తగా నడపాల్సిన పరిస్థితి. ఏపీసర్కార్ ఈ ఏడాది ప్రారంభంలోనే తడబడుతోంది. ఉద్యోగులకు ఇంకా ముఫ్పై శాతం మందికి జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. పరిస్థితి ఇలాగే ఉంటే… ముందు ముందు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదన్న ఆందోళన వ్యక్తమవుతోంది.