మధ్యప్రదేశ్లో ఓ అవినీతి అధికారి ఏసీబీ వాళ్లు వస్తున్నారన ఇంటి తలుపు వేసి.. స్టౌ వెలిగించి.. రూ. ఆరు లక్షల విలువైన నోట్లను తగలబెట్టేశారు. ఈ దృశ్యాలుకొద్ది రోజుల కిందట.. సంచలనం అయ్యాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలంగాణలోనూ కనిపించింది. కల్వకుర్తిలో ఓ టీఆర్ఎస్ నేత ఏసీబీ అధికారులు వస్తున్నారని రూ. 5 లక్షలు తగులబెట్టేశాడు. వెల్దండ తహసీల్దార్ తరపున ఆయన ఆ లంచం తీసుకున్నాడు. ఇద్దరూ దొరక్కడూదని ఆ నగదుని బుగ్గి చేయాలనుకున్నారు. రెండుచోట్లా.. వారు తగులబెట్టాలనుకున్నది లంచం సొమ్మునే. అవినీతి చేయడం ఎందుకు.. ఇలా దొరికిపోతామని తెలియగానే ఆ మొత్తాన్ని బుగ్గి చేయాలనుకోవడం ఎందుకు..?
ప్రభుత్వ ఉద్యోగి అంటే…లంచం తీసుకోవడం తమ హక్కు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ప్రజలు పన్నులుగా కడుతున్న వాటి నుంచే తాము జీతాలుగా తీసుకుంటున్నామన్న విషయాన్ని మర్చిపోయి…తమ విధి నిర్వహణ అయిన పౌరసేవలు చేయడానికి కూడా ప్రజల్ని పట్టి పీడిస్తున్నారు అధికారులు. ఏదైనా ఆస్తులకు సంబధించిన వ్యవహారం అయితే… విధిగా చేయాల్సిన పనిని కూడా చేయకుండా.. ఆ ఆస్తుల్లో వాటాలు తీసుకునేంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇప్పుడు దేశంలో ఏర్పడ్డాయి. చివరికి పుట్టినతేదీ ధృవపత్రం కావాలన్నా లంచం సమర్పించుకోనిదే జరగదు. ఆన్ లైన్ లు ఎన్ని వచ్చినా.. ఎన్ని ఏసీబీ దాడులు జరిగినా… పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. లంచావతారాలు వెనక్కి తగ్గడం లేదు. చివరికి తాము పీడించి తీసుకునేదిఅయినా తీసుకుంటాం… కాలం కలిసి రాకపోతే తగలబెట్టేస్తామని నిరూపిస్తున్నారు కానీ… అవినీతి విషయంలో కూడా వెనక్కి తగ్గడం లేదు.
దేశంలో అవినీతి వ్వవస్థీకృతమయింది. అవినీతికి పాల్పడి అయినా సరే బాగా డబ్బులు సంపాదించిన వాడ్ని హీరోలుగా చూస్తున్న సమాజం వచ్చేసింది. ఫలితంగా ఎవరూ …దోపిడీ చేసి.. ప్రజల్ని పీడించి డబ్బులు సంపాదించడాన్ని తప్పుగా భావించడం లేదు. దోపిడికి గురవుతున్న సమాజమే… తమను హీరోలుగా చూస్తూంటే వారు మాత్రం ఎందుకు వెనక్కి తగ్గతారు. ఇంకా ఇంకా దోపిడిని పెంచుకుంటూ పోతున్నారు. ఫలితంగా.. సమాజంలో లంచగొండి తనం పెరిగిపోతోంది. అధికారం చేతుల్లో ఉన్న వారు దోచుకున్నంత దోచుకుంటున్నారు. ఆ దోచుకున్న సొమ్మును ఎవరికీ ఉపయోగపడకుండా.. తగలబెట్టడానికైనా సిద్ధపడుతున్నారుకానీ.. దోచుకోవడం దగ్గర మాత్రం మొహమాట పడటం లేదు.
వ్యవస్థలో మార్పులు రావాలంటే ముందు ప్రజల్లో మార్పు రావాలి. తన పని చేస్తే చాలు ఎంతో కొంత సమర్పించుకుంటాననే భావన నుంచి ప్రతి ఒక్కరూ బయటకు రావాలి. పౌరసేవలు.. మాత్రమే కాదు..ప్రభుత్వ కార్యాలయంలో ఏ సేవ అయినా ఉచితంగా పొందాలి. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న పనులు చేయించుకునేందుకు .. లంచం ఆశ చూపకూడదు. ప్రజల్లో మార్పు వస్తే.. క్రమంగా సమాజంలో మార్పు వస్తుంది. లేకపోతే.. అవినీతి పరులు ఇలా డబ్బులు సంపాదించి కాల్చేస్తూనే ఉంటారు.