తమిళనాడు ఎన్నికలలో ఎవరు గెలుస్తారో, ఎవడు ఓడతారో అనే చర్చని పక్కదారి పట్టించాడు విజయ్. ఒకే ఒక్క సైకిల్ రైడ్ తో. తన ఇంటి దగ్గర నుంచి.. పోలింగ్ బూతు వరకూ సైకిల్ పై వచ్చిన విజయ్.. తమిళ నాడు ఓటర్లకు కొత్త రకమైన సంకేతాల్ని పంపాడు. ఆ ఫొటోలు, వీడియోలు.. దేశమంతా వైరల్ అయిపోయాయి. పెట్రోల్ ధరలు పెరిగినందుకు నిరసనగా.. విజయ్ సైకిల్ తొక్కాడని – జనాలు ఫిక్సయిపోయారు. అది మోడీపై నిరసనే అని తమకు తామే అనేసుకున్నారు. విజయ్ నిరసన వినూత్నంగా ఉందని మోడీ వ్యతిరేకులు…. విజయ్ ని రియల్ హీరోని చేసేస్తుంటే, ఇదంతా పబ్లిసిటీ స్టంట్, రోజూ షూటింగ్ కి ఇలానే సైకిల్ పై వెళ్లగలడా? అంటూ మోడీ భక్తులు విరుచుకుపడుతున్నారు.
అయితే విజయ్ సన్నిహితుడు ఈ విషయంపై మాట్లాడుతూ… ఇరు వర్గాలపై నీళ్లు చల్లేశాడు. విజయ్ ఇంటికీ పోలింగ్ బూత్ కీ ఎంతో దూరం లేదు కాబట్టే, విజయ్ సైకిల్ పై వచ్చాడని, పైగా… ఆ మార్గంలో అన్నీ ఇరుకు రోడ్లే అని, కారులో వస్తే. పార్కింగ్ చేయడానికి సైతం సరైన స్థలం లేదని, అందుకే సైకిల్ పై రావాల్సివచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. దాంతో… ఈ సైకిల్ రైడ్ సీన్ తుస్సుమనిపించేసింది. అయితే అప్పటికే జనాలకు ఏం చేయాలో అది చేరిపోయింది కాబట్టి, ఓ రకంగా విజయ్… తాను అనుకున్నది సాధించేసినట్టైంది.