హైదరాబాద్: ముద్రగడ నిరాహారదీక్ష అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం ఇవాళ విశాఖపట్నంలో జరిగింది. ఆ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చటంపై వెనకడుగు వేయబోమని యనమల చెప్పారు. బీసీలకు నష్టం కలిగించకుండా కాపులకు న్యాయం చేస్తామని అన్నారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు కాపులకు హామీ ఇవ్వటానికి వెనక కారణాన్ని వివరించారు. పాదయాత్ర చేస్తున్న సమయంలో కొందరు కాపు సంఘాల నేతలు వచ్చి కాపులను బీసీల్లో చేర్చటంపై వినతిపత్రం సమర్పించారని, దానిపై స్పందిస్తూ, తాము అధికారంలోకి వస్తే బీసీల్లో చేరుస్తామని చంద్రబాబు నాడు ప్రకటించారని గుర్తు చేశారు. ప్రస్తుతం రాష్ట్రం క్లిష్టపరిస్థితుల్లో ఉందని, రు.700 కోట్ల లోటు బడ్జెట్ ఉందని, అందరూ అర్థం చేసుకోవాలని యనమల అన్నారు. మరోవైపు తోట త్రిమూర్తులు, బొడ్డు భాస్కర రామారావులను మరోసారి ముద్రగడ వద్దకు పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది.