దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎన్నికలంటే భయపడినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన యాటిట్యూడ్‌లో మార్పు వచ్చింది. ఇక వరుసగా ఎన్నికలు పెట్టేసి.. తెలంగాణ సర్కార్‌పై ప్రజల్లో ఉన్న సానుకూలతను బయట పెట్టాలని డిసైడ్ అయ్యారు. నాగార్జున సాగర్‌లో తిరుగులేని విజయం దక్కుతుందన్న నమ్మకంతో ఉన్న కేసీఆర్.. ఆ నియోజకవర్గ బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. రోజువారీ సమీక్షలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని .. ఎక్కడ తేడా ఉందో..అక్కడ నేతలను పంపి సర్దుబాటు చేస్తున్నారు. ఆ ఎన్నిక తర్వాత కూడా మళ్లీ ఎన్నికలకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.
నాగార్జున సాగర్ ఉపఎన్నిక ముగిసిన తర్వాత మే రెండో తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే… మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరిగేలా షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం ఉంది. రెండు కార్పొరేషన్లు, కొన్ని మున్సిపాల్టీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం , వరంగల్ కార్పొరేషన్లపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఆయా జిల్లాల నేతలు ఇప్పటికే అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేశారు. ప్రస్తుతం వారు సాగర్ పోలింగ్ కాన్వాసింగ్లో ఉన్నారు. పదిహేనో తేదీన అక్కడ ప్రచారం ముగుస్తుంది. ఆ తర్వాత ఆ జిల్లాల నేతలు కార్పొరేషన్ ఎన్నికల పని మీద ఉండాలని సందేశాలు కూడా వెళ్లాయి. ఇప్పటికే ఎన్నికలు జరగాల్సిన కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఏర్పాట్లు పూర్తిచేశారు.
సాగర్‌లో బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వరంగల్, ఖమ్మంలలోనూ ఆ పార్టీ ఇటీవలి కాలంలో కార్యక్రమాలు పెంచింది. సాగర్ దెబ్బద్వారా బీజేపీకి మరింతగా కిందకు నెట్టాలని కేసీఆర్ సంకల్పంతో ఉన్నారు. కార్పొరేషన్ల ఎన్నికలతో ఆ టాస్క్ పూర్తి చేసి.. బీజేపీ రేసులో లేదని నిరూపించాలని భావిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే పక్కా స్కెచ్ రెడీ చేశారని… ఇక అమలు చేయడమే మిగిలిదిందని అంటున్నారు. కేసీఆర్ వ్యూహాలను తట్టుకోవడం బీజేపీ నేతలకు అంత తేలిక కాదని టీఆర్ఎస్ నేతలంటున్నారు.