‘పుష్ష’ టీజర్‌లో యాక్షన్ హంగామా బాగా కనిపించింది. అయితే వినిపించిన ఒకే ఒక్క మాట `తగ్గేదే… లే`. గెడ్డం కిందనుంచి చేయిని రుద్దుతూ… అదో మాదిరిగా డైలాగ్ పలికాడు బన్నీ. ఆ స్టైల్ అభిమానులకూ నచ్చేస్తోంది. `పుష్ష` టీజర్ ఆవిష్కరణ సభలోనూ…`తగ్గేదేలే…` అనే డైలాగ్ ని పదే పదే పలుకుతూ.. అభిమానుల్ని అలరించాడు బన్నీ. తనకు ఈ పదం చాలా ఇష్టమని, నిరుత్సాహంలో ఉన్నప్పుడు.. తన కూడా `తగ్గేదే లే` అనుకునే.. ప్రయాణం ప్రారంభిస్తానని.. అందుకే ఈ డైలాగ్ మరింత దగ్గరైందని చెప్పాడు బన్నీ. అమ్మాయిలు తగ్గి ఉండాలి, అణిగిమణిగి ఉండాలని అంటుంటారని, అయితే… అమ్మాయిలు కూడా తగ్గకూడదని.. వాళ్లనీ కాస్త ఉత్సాహపరిచే ప్రయత్నం చేశాడు. అభిమానుల మధ్య పుట్టిన రోజు పండగ చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, ఏం చేసినా తన అభిమానుల కోసమే అని, వాళ్లకు జీవితాన్ని అంకితం చేశానని భావోద్వేగంగా మాట్లాడాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించింది. రష్మిక కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.