ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగసభకు వెళ్లక ముందే తిరుపతి ప్రజల్ని ఓటు అడిగారు. తిరుపతి ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని ప్రత్యేకంగా లేఖ రాశారు. ముఖ్యంగా తమ ప్రభుత్వ హయాంలో పథకాలు పొందిన లబ్దిదారులందరికీ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరుతో లేఖ రాశారు. ఇరవై రెండు నెలలుగా ఎన్నెన్ని పథకాలు అందించామో.. ఎంతెంత ఖర్చు చేశామో.. ఎవరెవరికి ఎంతెంత లబ్ది చేకూర్చామో.. వివరిస్తూ..లేఖలు రాశారు. పథకాల లబ్దిదారులందరి జాబితాను దగ్గర పెట్టుకుని రెడీ చేసిన లేఖలను.. స్వయంగా పార్టీ శ్రేణులు.. ఆయా పథకాల లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఇచ్చి తప్పనిసరిగా ఓటు వేయాలని అభ్యర్థించనున్నాయి. జగన్మోహన్ రెడ్డి అటు అడిగినట్లుగా లేఖ ఉంది.
ఇంత వరకూ బాగానే ఉన్నా అసలు జగన్మోహన్ రెడ్డి.. ప్రజలను ఓటు అడగరగని.. అడగకుండానే ప్రజలు ఓట్లేస్తారని మంత్రులు కొద్దిరోజులుగా గొప్పలు చెప్పుకుంటున్నారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అసలు ఓటు అడగలేదని గుర్తు చేశారు. తిరుపతి ఎన్నికల్లోనూ జగన్ ఓటు అడగరని వారు చెప్పుకొచ్చారు. అనూహ్యంగా పధ్నాలుగో తేదీన జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ప్రచారం చేయాలని నిర్ణయించారు. అంత కంటే ముందుగానే ప్రభుత్వ పథకాల లబ్దిదారులందరికీ.. లేఖలు రాయడం ప్రారంభించారు. వాటిని స్వయంగా పార్టీ శ్రేణులే వెళ్లి ఇస్తాయి కాబట్టి ఆ ప్రభావం వేరేగా ఉంటుందని వైసీపీ నేతలు అంచనాకు వస్తున్నారు.
అయితే.. ప్రభుత్వ పథకాలేమైనా జగన్మోహన్ రెడ్డి జేబు నుంచి తీసి ఇచ్చారా… ప్రభుత్వం పన్నుల రూపంలో కట్టిన సొమ్ములేనని.. ప్రజల్ని అప్పుల పాలు చేసి.. పప్పు బెల్లాలు పంచుతున్నారని మండిపడుతున్నారు. అంతే కాక గత ప్రభుత్వం ప్రజలకు అందిన పథకాలను కూడా ఆపేశారని అంటున్నారు. వాటన్నింటినీ తాము ప్రజలకు వివరిస్తామని విపక్ష నేతలు అంటున్నారు. మొత్తానికి … ఓటు అడగను బ్రదర్ అన్న పొజిషన్ నుంచి ఓటు అడిగేశారు బ్రదర్ అనే పరిస్థితికి వచ్చిందని టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు