ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రికి రాత్రి సినిమా ధియేటర్లలో టిక్కెట్ రేట్లు ఎంతెంత ఉండాలో డిసైడ్ చేస్తూ జీవో జారీ చేసేసింది. తాము చెప్పినదానిపై ఒక్క పైసా వసూలు చేయకూడదని .. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఆ టిక్కెట్ రేట్లు చూసిన సినీ ప్రముఖులకు కళ్లు బైర్లు కమ్మాయి. మొన్ననే… లాక్డౌన్లో ధియేటర్లు మూసేసిన మూడు నెలల కాలానికి కరెంట్ ఫిక్స్డ్ చార్జీలను తగ్గించారని .. శభాష్ అన్న పెద్దలకు ఇప్పుడు… నోట మాట రాని పరిస్థితి ఏర్పడింది.
అర్థరాత్రి జీవో వెనుక ఏం జరిగింది..?
రాత్రి పూట హడావుడి జీవో వెనుక చాలా పెద్ద కథ ఉంది. పెద్ద సినిమా విడుదలైన కొత్తలో రెండు వారాల పాటు టిక్కెట్లు రేట్లు పెంచుకునేందుకు గతంలో అనుమతి ఉంది. అయితే వకీల్ సాబ్‌కు ఆ అనుమతిని రద్దు చేశారు. దీనిపై కొంత మంది డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్ల విచారణ సందర్భంగా…ఈ వ్యవహారాలు చూసే అదనపు కలెక్టర్లు .., ప్రభుత్వం నుంచి తమకు ప్రత్యేకమైన ఆదేశాలేమీ రాలేదు..స్వతహాగానే అనుమతి రద్దు చేశామని కోర్టుకు చెప్పారు. దీంతో కోర్టు ఆ ఉత్తర్వులను కొట్టి వేసింది. ఈ కారణంగా గుంటూరు, కృష్ణా లాంటి చోట్ల జాయింట్ కలెక్టర్లు రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఈ పరిస్థితి ఇతర జిల్లాల్లోనూ ఉంటుందని భావించిన ప్రభుత్వం.. రాత్రికి రాత్రి జీవో ఇచ్చేసింది. సినిమా కొద్ది సేపట్లో విడుదలవుతుందనగా ప్రభుత్వం జీవో రిలీజ్ చేసింది. ఈ జీవో ప్రకారం.. కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టిప్లెక్స్ లలో ప్రీమియం సీట్ల టిక్కెట్ రేట్లు రూ. రెండు వందల యాభై మాత్రమే ఉండాలి. మిగతా టిక్కెట్లు రూ. 150, వంద ఉండాలి. సింగిల్ ధియేటర్లు ఏసీ సౌకర్యం ఉంటే అత్యధిక రేటు రూ. వంద మాత్రమే. ఏసీ లేకపోతే.. అత్యధిక టిక్కెట్ ధర రూ. అరవై . ఈ టిక్కెట్ రేట్లు… జనాభా స్థాయిని బట్టి పట్టణాల్లో మారుతూ ఉంటాయి. పంచాయతీల్లో ఉన్న ధియేటర్లలో మరింత తక్కువ.
వకీల్ సాబ్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టడమే లక్ష్యం..!
వకీల్ సాబ్‌ను టార్గెట్ చేయలేదని చెప్పుకోవడానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. నిన్న కొంత మంది ధియేటర్ల యజమానులతో సమావేశం ఏర్పాటు చేయించి.. టిక్కెట్ రేట్ల పెంపును వ్యతిరేకిస్తున్నట్లుగా ప్రకటనలు చేశారు. అలా చేయడం వల్ల ప్రేక్షకులు దూరమవుతారని చెప్పుకొచ్చారు. నిజానికి పెద్ద సినిమాలు విడుదలైన వారం లేదా రెండు వారాలు మాత్రమే టిక్కెట్ రేట్ల పెంపు ఉంటుంది. ఆ విషయం ఆ ధియేటర్ యాజమాన్యాలకు తెలియక కాదు. అయినప్పటికీ.. వారు ప్రెస్‌మీట్ పెట్టారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో.. వారి డిమాండ్‌ను .. టిక్కెట్ రేట్లను ఫిక్స్ చేయడానికి ఓ కారణంగా చూపించింది. అలాగే 2016లో కోర్టు ఇచ్చిన తీర్పును కూడా కారణంగా చూపించారు.
రాజకీయంతో వ్యాపారాలను దెబ్బకొడితే ఎవరికి నష్టం..?
పవన్ కల్యాణ్ సినిమాల విషయంలో తాము రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడబోమని.. కొడాలి నాని వంటి మంత్రులు కొద్దిరోజులుగా ప్రకటిస్తున్నారు. ఆయన సినిమాను ఏ రూపంలోనూ అడ్డుకోబోమని చెప్పుకొచ్చారు. ఆ ధైర్యంతోనే … వకీల్ సాబ్ డిస్ట్రిబ్యూటర్లు… ధియేటర్లు పెద్ద ఎత్తున అడ్వాన్సులు కట్టి.. సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ.. ప్రభుత్వం చివరి క్షణంలో షాక్ ఇచ్చింది. రెగ్యులర్ షోలు తప్ప.. అదనపు షోలు వేయడానికి ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకపోగా… టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు కూడా అంగీకరించలేదు. దీంతో పెద్ద ఎత్తున ఆదాయానికి గండిపడనుంది. నిజానికి కరోనా తర్వాత విడుదలైన కొన్ని సినిమాల టిక్కెట్ రేట్లను పెంచుకునేందుకు ఏపీ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది.
కరోనా నుంచి బయటపడేందుకు రెండు రోజుల కిందట… ఓ ప్యాకేజీని ప్రకటించిన ఏపీ సర్కార్… టిక్కెట్ రేట్లు.. బెనిఫిట్ షోల విషయంలో సానుకూలంగా ఉంటుందని అనుకున్నారు. మిగతా హీరోల విషయంలో సానుకూలంగా ఉంటుందేమో కానీ పవన్ విషయంలో మాత్రం అంత సహృదయం చూపే చాన్స్ లేదని తేలిపోయింది. మరో వైపు తెలంగాణలో వకీల్ సాబ్ సినిమాకు సంపూర్ణమైన సహకారం లభిస్తోంది. పెద్ద ఎత్తున రేట్లు పెంచుకుని.. కావాల్సినన్ని షోలు వేసుకునేవిధంగా ఆ చిత్ర యూనిట్‌కు స్వేచ్చ లభించింది. కానీ ఏపీలో మాత్రమే షాక్ తగులుతోంది. ఇదంతా రాజకీయం కాక మరేమిటని పవన్ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.