శ్రీవారి ప్రధాన అర్చకుడిగా మళ్లీ నియమించినందుకు జగన్మోహన్ రెడ్డిని విష్ణుమూర్తిగా ప్రశంసించారు రమణదీక్షితులు. శ్రీవారిని తప్ప దైవంగా మానవమాత్రుడ్ని కీర్తించకూడదన్న కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన ఏళ్ల తరబడి శ్రీవారి ప్రధాన ఆర్చకుడిగా కొనసాగడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. వైసీపీతో సన్నిహితంగా ఉండే హిందూత్వ సంఘాలు..మఠాలు తప్ప.. మిగతా అందరూ రమణదీక్షితుల మాటల్నితప్పు పట్టారు. కొంత మంది రమణదీక్షితులు తెలిసి అన్నారో.. తెలియక అన్నారో కానీ.. జగన్మోహాన్ రెడ్డికి ఆయన వల్ల కీడు జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. పరిపూర్ణానంద ఇదే చెబుతున్నారు. మహావిష్ణువు వల్ల రాజు అవుతారు కానీ… రాజును శ్రీమహావిష్ణువుగా అభివర్ణిస్తే. అది రాజుకే చేటు.. అందుకే ఇలాంటి పొగడ్తల్ని వైసీపీ నేతలు ఆహ్వానించకూడదని ఆయన చెబుతున్నారు.
జగన్ను రమణదీక్షితులు శ్రీమహావిష్ణువుతో పోల్చడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతిని ఉండవచ్చు. కానీ రమణదీక్షితులకు మేలు జరిగింది.అందుకే ఆయన పొగిడారు. అయితే అదే సమయంలో… ఆయన వల్ల ఇప్పటికే ప్రధాన అర్చకులుగా విధుల్లో ఉన్న నలుగురు తమ ప్రాధాన్యాన్ని కోల్పోయారు. వారందరూ.. బయటకు చెప్పలేకపోయినప్పటికీ.. రమణదీక్షితులు లాంటి .. మానసిక పరిస్థితే ఉంటే..వారు జగన్మోహన్ రెడ్డిని ఏమని శపించి ఉంటారు..?. మనకు మేలు చేసిన వాళ్లే మంచి వాళ్లు ..ఇతరులకు కీడు చేసి అయినా సరే అనుకుంటే..దేవుడు అలాంటి వారిని ఎప్పుడూ చల్లని చూపులు చూసిన సందర్భాలు ఉండవు.
రమణదీక్షితుల వ్యవహారం.. హిందువుల్లో ప్రభుత్వం తీరుపై అసహనానికి కారణం అవుతోంది. పింక్ డైమండ్ పేరుతో శ్రీవారి ఆలయాన్ని రాజకీయం చేసి… చివరికి రాజకీయం కోసం ఎంతకైనా దిగజారే పరిస్థితి తెచ్చుకున్న రమణదీక్షితులను ఇప్పుడు మళ్లీ ప్రధాన అర్చుకులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన ప్రధాన అర్చకుడిగా ఉన్నప్పుడు వైఎస్ కోసం కొండ మీద యాగం చేయడం దగ్గర్నుంచి ఎన్నెన్నో వ్యక్తిగత లబ్ది కార్యక్రమాలు చేపట్టారు. కొండపై శ్రీవారి నామం తప్ప మరేమీ వినిపించకూడదన్న నిబంధన ఉంది. కానీ ఆయన మాత్రం వ్యక్తిగత లబ్ది కోసం దేనికైనా వెనుకాడేవారు కాదు. తిరుమల వ్యవహారాలు… భక్తులను మనోవేదనకు గురి చేస్తున్నా.. పట్టించుకునేవారు లేరు.