దేశంలో లాక్ డౌన్ విధించే ఆలోచన లేదని గురువారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ .. .ముఖ్యమంత్రులకు చెప్పడంతో దేశ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడా లాక్ డౌన్ విధిస్తారోనని ఇప్పటికే ప్రజలు టెన్షన్ పడుతున్నారు. అయితే రాష్ట్రాలకు మోడీ కొన్ని కీలక సూచనలు చేశారు. అందులో అత్యంత కీలకమైనది.. నైట్ కర్ఫ్యూ. లాక్ డౌన్‌కు ప్రత్యామ్నాయం నైట్ కర్ఫ్యూ అని ప్రకటించారు. దీంతో బీజేపీ పాలిత ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించడం ప్రారంభించారు. ఇప్పటికే కరోనా కేసులు అత్యధికం ఉన్న మహారాష్ట్ర, పంజాబ్ వంటి ప్రభుత్వాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తాజాగా కర్ణాటక కూడా అదే బాట పట్టింది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రులు అదే ఆలోచన చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.
అయితే… నైట్ కర్ఫ్యూ వల్ల కరోనా ఎలా కట్టడి అవుతుందన్నది నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు. సాధారణంగా దేశంలో జన సంచారం తొమ్మిది తర్వాత తగ్గిపోతుంది. రాత్రిపూట ఎలాంటి వ్యాపార.. వ్యవహారాలు జరగవు. అత్యవసరం అయిన వారు మాత్రమే బయట తిరుగుతూ ఉంటారు. వారిని కట్టడి చేస్తే.. కరోనా ఎలా కట్టడి అవుతుందనేది మౌలికమైన ప్రశ్న. అదే సమయంలో దేశంలో కరోనా నిబంధనలు ఎక్కడా పాటించడం లేదు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కానీ.. మాల్స్‌లో కానీ.. ఇతర చోట్ల కానీ… అన్నీ.. కరోనా లేనట్లుగానే సాగిపోతున్నాయి.
కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించినా.. ఎవరూ లెక్క చేయని పరిస్థితి ఉంది. కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు చేస్తే తప్ప.. కరోనా కంట్రోల్ అ్యయే పరిస్థితి లేదు. ఇలాంటి విషయాల గురించి పట్టించుకని యంత్రాంగం.. ఏదో ఓ పూట లాక్ డౌన్ పెడితే సరిపోతుందన్నట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఎదుర్కొంటున్నాయి. ప్రజలు కూడా.. కరోనా కట్టడిని ప్రభుత్వాలు తీసుకున్నంత సీరియస్‌గానే తీసుకుంటున్నారు. ఎవరూ నిబంధనలు పాటించడం లేదు.