అద్దెలు కట్టలేకపోతున్నామని గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అద్దె భవనాల్లో ఉన్న శాఖాధికారుల కార్యాలయాలను … ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ చూసుకుని ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలని ఏపీ ప్రభుత్వం ఆయా శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రభుత్వ భవనాల్లో ఖాళీలు ఎక్కడ ఉన్నాయో వెదుక్కునే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ కార్యాలయాన్ని ఏపీఐఐసీ భవనంలోకి మార్చారు. ఇప్పుడు ఇతర భవనాల్లో ఖాళీలు ఉన్నాయేమో వెదుక్కుంటున్నారు. నిజానికి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అద్దె భవనాల విషయంలో కాస్త గట్టిగా వ్యవహరిస్తోంది. గత ప్రభుత్వంలో అన్ని టీడీపీ నేతల భవనాలు అద్దెకు తీసుకున్నారని.. ఎక్కువ అద్దె చెల్లిస్తున్నారని.. ఖాళీ చేయాలని మౌఖిక ఆదేశాలు కూడా వెళ్లాయి.
ఈ లోపు విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తరలింపు నిర్ణయం తీసుకోవడంతో ఇక నేరుగా విశాఖకే తరలించవచ్చని అనుకున్నారు. ఆ కారణంతోనే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఆగిపోయింది. ప్రభుత్వం కూడా తరచూ.. ఏ క్షణమైనా విశాఖకు పరిపాలనా రాజధాని అని ప్రకటనలు చేస్తూ వస్తోంది. చాలా మంది హెచ్వోడీలు విశాఖకు వెళ్లి .. తమ తమ కార్యాలయాలకు సరిపడా భవనాలను చూసుకుని వచ్చారు. కానీ ఇంకా రాజధాని తరలింపుపై అధికారిక నిర్ణయం వెలువడనందున ఒప్పందం చేసుకోలేదు. ఇప్పుడు… గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే… ప్రభుత్వ కార్యాలయాల్లోకి మార్చాలని ప్రభుత్వమే చెబుతోంది.
దీంతో హెచ్వోడీలకు మరింత గందరగోళం ఏర్పడింది. కార్యాలయాన్ని ఒకచోట నుంచి ఒక చోటకు మార్చడం అంటే…. కుర్చీలు తీసుకెళ్లడం కాదని చాలా పెద్ద తతంగం ఉంటుందని… కనీసం రెండు నెలలు పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో… కార్యాలయాలను పదే పదే ఎలా మార్చాలని వారు గందరగోళపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికే క్లారిటీ లేదు. ఇక… శాఖాధిపతులు మాత్రం ఏం చేయగలరు..?