ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వకీల్ సాబ్ సినిమాపై ఎంత పగ చూపిస్తోందంటే… ఆ సినిమాకు రూ. పది లక్షల నష్టం రావడానికి ప్రభుత్వం రూ. ఇరవై లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడని పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యేకంగా ఓ టీంను నియమించి మరీ వకీల్ సాబ్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. దానికి తాజాగా హైకోర్టులో ప్రభుత్వం వేసిన హౌస్ మోషనల్ పిటిషనే ఉదాహరణ. వకీల్ సాబ్ సినిమాకు ఊరట కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మూడు రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకోవచ్చునని అవకాశం కల్పించింది.
అసలు ఏ మాత్రం… ఒక్క రూపాయి కూడా అదనంగా పవన్ కల్యాణ్ సినిమాకు కలెక్షన్ రాకూడదని అనుకున్నారేమో కానీ.. ప్రభుత్వం అప్పటికప్పుడు స్పందించింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై వైఎస్ జగన్ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి, బెనిఫిట్ సినిమాలు వేయడానికి జగన్ ప్రభుత్వం అనుమతించలేదు. రాత్రికి రాత్రి జీవో ఇచ్చి… ఉదయం ధియేటర్ యజమానుల వద్ద నుంచి డబ్బుల్ని వెనక్కి ఇప్పించేశారు. ఇందు కోసం రెవిన్యూ అధికారులు తీవ్రంగా కష్టపడ్డారు.
మరో వైపు.. ఈ సినిమాపై వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం తీవ్రంగా కట్టడి చేస్తోంది. ఈ పరిస్థితుల్ని బీజేపీ నేతలు కూడా రాజకీయం చేయడానికే ఉపయోగిస్తున్నారు కానీ… తమ పలుకుబడిని ఉపయోగించి… సినిమా జోలికి రావొద్దని మాత్రం చెప్పడం లేదు. దీంతో రాజకీయం మధ్యలో… సినిమా నలిగిపోతోంది. రాజకీయ విబేధాల్ని వ్యక్తిగత శత్రుత్వాలుగా పరిగణించి చేస్తున్న రాజకీయంతో ఏపీ పొరుగు రాష్ట్రాల్లో చులకన అయిపోతోంది.