డీజీపీ ర్యాంక్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌లో ఉన్నారు. తనపై ప్రభుత్వం చేసిన ఆరోపణల వెనుక ఉన్న కుట్ర అంతా ప్రస్తుత డీజీపీ గౌతం సవాంగ్‌దేనని ఆయన తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని ఆరోపిస్తూ… సీబీఐ విచారణ చేయించాలని చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. చీఫ్ సెక్రటరీ స్పందించకపోతే.. తాను కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఈ కేసు అంశం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఏబీవీ వెంకటేశ్వరరావు … డీజీపీ గౌతం సవాంగ్ ఏ ఏ తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించారో కూడా.. తన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు.
తనను కేసుల్లో ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలు.. దానికి సాక్ష్యాలు.. తప్పుడు పత్రాల సృష్టి వంటి వాటిపై మొత్తం తొమ్మిది పేజీల లేఖను.. ఏబీవీ.. చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌కు పంపారు. తన ఆరోపణలను రుజువు చేసే 9 పత్రాలను కూడా జోడించారు. డీజీపీ గౌతం సవాంగ్ తన స్వహస్తాలతో ఫోర్జరీ చేశారని..అలాగే సీ ఐ డీ అదనపు డీజీపీ సునీల్ కుమార్, ఏసీబీ డీజీ సీతా రామాంజనేయులు, ఇంటలిజెన్స్ విభాగపు అధికారులు కలిసి తనపై తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లుగా ఏబీవీ లేఖలో పేర్కొన్నారు.
బాలీవుడ్లో విడుదల కానున్న మాధవన్ సినిమా రాకెట్రీ లో నంబీనారాయణ అనే శాస్త్రవేత్తను ఎలా దేశద్రోహం కేసులో ఇరికించారో తనపైనా అలాంటి కుట్రే జరిగిందని ఏబీవీ చెబుతున్నారు. నంబి నారాయణన్ స్టోరీ రియల్ స్టోరీ. ఆయన కథతోనే మాధవన్ సినిమా తీశారు. నంబినారాయణ్ కేసులో- అప్పటి డీజీపీ, ఇంటలిజెన్స్ బ్యూరో జాయింట్ డైరెక్టర్ ప్రధానంగా కుట్ర పన్నారు. దేశద్రోహం కేసు పెట్టారు. ఈ కేసులో తప్పుడు కేసు పెట్టినందుకు కేరళ ప్రభుత్వం నంబి నారాయణ్‌కు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఏబీవీ కూడా.. సీబీఐ విచారణ చేయించి.. పరిహారం కోసం కోర్టులో పిటిషన్ వేయాలని ఆలోచన చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేసిన ఏబీవీపై ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకు చాలాకోపం ఉంది. ఆయనను ఎలాగైనా ఫిక్స్ చేయాలన్న ఉద్దేశంతో చాలా కాలం పాటు పోస్టింగ్ ఇవ్వలేదు. తర్వాత హఠాత్తుగా కేసులు పెట్టి సస్పెండ్ చేశారు. అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. కోర్టు నుంచి ఆయన రక్షణ పొందారు. తోటి సీనియర్ ఐపీఎస్‌పై.. ఇతర ఐపీఎస్ అధికారులే … క్రిమినల్స్ మాదిరిగా వ్యవహరించి తప్పుడు కేసులు.. సాక్ష్యాలు సృష్టించడం నిజమే అయితే.. సంచలనాత్మకం అవుతుంది. ఇప్పుడు ఐపీఎస్ అధికారుల బండారం అంతా బయటపెడతానని అంటున్నారు.
ఏబీవీ ఈ విషయాన్ని ఇంతటితో వదిలే పరిస్థితి కనిపించడం లేదు. ఏపీలో ఐపీఎస్‌ల మధ్య చిచ్చు రేగటం ఖాయంగా కనిపిస్తోంది.