`వకీల్ సాబ్` Vs జగన్ ప్రభుత్వం… అన్నట్టు తయారైంది ఏపీలో పరిస్థితి. ఏపీలో వకీల్ సాబ్ టికెట్ రేట్లు పెంచుకోవడానికీ, అదనపు షోలకూ…. అడ్డుకట్ట వేసింది. దాంతో.. ఏసీ వసూళ్లలో గణణీయమైన తేడా కనిపించబోతోంది. ఎక్స్ట్రా షోలూ, టికెట్ రేట్ల పెంపుదల ఉంటుందన్న ఆశతో.. బయ్యర్లు భారీ రేట్లకు ఈ సినిమాని కొన్నారు. ఈసినిమా అనే కాదు. `ఆచార్య` కూడా ఇంతే. ఏపీలో కనీవినీ ఎరుగని స్థాయిలో `ఆచార్య` బిజినెస్ జరిగింది. బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు సౌలభ్యం ఉందన్న ధీమాతోనే బయ్యర్లు ఈ సినిమాల్ని కొన్నారు.
వకీల్ సాబ్ కి అడ్డుపడి, ఆచార్యకు ఏపీలో గ్రీన్ సిగ్నల్ లభిస్తుందనుకోవడం అత్యాస. ఎందుకంటే… అన్ని సినిమాల్నీ,అందరు హీరోల్నీ సమానమైన దృష్టిలోనే చూస్తున్నాం – అని చెప్పుకోవడానికైనా, `ఆచార్య`కూ ఇవే నిబంధనల్ని వర్తింపజేస్తారు. చిరుకీ, జగన్ కీ మంచి స్నేహం ఏర్పడుతోందిప్పుడు. జగన్ చిత్రసీమకు ఏ కొంచెం మంచి చేసినా చిరు `ఆహా` అంటూ ట్వీట్ చేసేస్తున్నారు. చిరు సినిమా కదా, అని చూసీ చూడనట్టు వదిలేయడం కూడా జగన్ ప్రభుత్వానికి కష్టమే. కాబట్టి వకీల్ సాబ్ అనే కాదు, భవిష్యత్తులో ఏ పెద్ద సినిమా వచ్చినా – ఇవే నిబంధనలు వర్తింపజేస్తారు. కాబట్టి ఏపీలో తొలి మూడు రోజుల్లోనే వసూళ్లు లాగేద్దాం అనుకునే నిర్మాతలకు ఇది పెద్ద దెబ్బ.