ఓ పెద్ద సినిమా వస్తోందంటే.. ఏదో ఓ రూపంలో దాన్ని ఆపడానికి ఓ వర్గం ఎప్పుడూ ప్రయత్నిస్తుంటుంది. వాళ్లు చేసే ప్రయత్నాల వల్ల సినిమా ఆగిపోదు గానీ, పరోక్షంగా బోలెడంత పబ్లిసిటీ వస్తుంటుంది. ఇప్పుడు ఓ రెండు సినిమాలపై కూడా ఇలాంటి వివాదమే రేగనుంది. ఆ సినిమాలే.. ఆచార్య, విరాటపర్వం.
చిరంజీవి నటించిన `ఆచార్య`కీ.. రానా చేసిన `విరాటపర్వం`కీ ఓ పోలిక ఉంది. రెండూ నక్సల్ నేపథ్యంలో సాగే కథలే. ఈ రెండు సినిమాల్లోనూ హీరోలు నక్సలైట్లగా కనిపించనున్నారు. ఆయా కథల్లో అభ్యుదయ భావాలు ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సినిమాల వల్ల, సమాజం చెడిపోతుందని, యువతరానికి తప్పుడు సంకేతాలు అందుతాయని, కాబట్టి ఈ సినిమాల్ని సెన్సార్ చేయకుండా ఆపాలంటూ.. యాంటీ టెర్రరిజం ఫారమ్ అనే సంస్థ ఓ వినతి పత్రం సమర్పించింది. ఈ సినిమా విడుదలైతే మాత్రం థియేటర్ల ముందు తమ నిరసన వ్యక్తం చేస్తామని, విడుదలను అడ్డుకుంటామని తెలిపింది. అయితే దీన్ని సెన్సార్ ఎంత సీరియస్ గా తీసుకుంటుందో చూడాలి.నిజానికి సినిమాలో ఏముందన్న విషయం సెన్సార్ అయితే గానీ తెలీదు. నక్సల్ ఉద్యమ నేపథ్యంలో ఇంతకంటే భయంకరమైన, ప్రభావవంతమైన సినిమాలు ఇది వరకూ వచ్చాయి. కానీ.. ఎవ్వరూ వాటిని ఆపలేదు. ఈ రెండు సినిమాలూ అందుకు మినహాయింపు మాత్రం కాదు.