ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు రాజకీయాలకు అతీతమైన ఓ చర్చ జరుగుతోంది. దీన్ని రాజకీయ నేతలు చేయడం లేదు. ఆర్థిక నిపుణులు చేస్తున్నారు. ప్రభుత్వంతో … ప్రభుత్వ పెద్దలతో అత్యంత సన్నిహితంగా ఉండి.. ఆర్థిక అధికార విధుల నిర్వహణలో రాటుదేలిపోయిన వారు.. ప్రస్తుతం ఈ చర్చ లేవెత్తుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలోని అధికారులు జైలుకెళ్లే ప్రమాదం ఉందని అంటున్నారు. జైలుకెళ్లేంత పెద్ద తప్పు ఆర్థికశాఖ అధికారులు చేయలేదు. వారు చేసింది అప్పు మాత్రమే. అయితే ఆ అప్పు చేసిన విధానమే.. ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. ప్రభుత్వ ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల కిందట… రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ కింద రూ. పాతిక వేల కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. అయితే ఇలా కార్పొరేషన్ ఏర్పాటు చేయగానే.. అలా రుణం ఇచ్చేయరుగా..! ఆస్తులు.. ఆదాయం ఉండాలి. అందుకే ఎక్సైజ్ ఆదాయాన్ని అంటే…మద్యం తాగేవార్ని నిట్ట నిలువుగా దోచేస్తూ వసూలు చేస్తున్న మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కార్పొరేషన్‌కు మళ్లిస్తున్నారు. దీని కోసం ఎస్క్రో ఖాతాలు ప్రారంభించారు. ఆ డబ్బుతో పథకాలకు చెల్లింపులు చెస్తే సమస్య ఉండేది కాదు. కానీ ఆ డబ్బును అప్పుల కింద జమ చేస్తున్నారు. ఇప్పుడే కాదు… వచ్చే ఆదాయం అంతా అప్పుల కిందే జమ చేస్తున్నారు. అంటే.. ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారన్నమాట. ఇప్పుడు ఇదే పెద్ద వివాదం అయిపోయింది. ఇలా రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని తాకట్టు పెట్టడం తీవ్రమైన ఆర్థిక నేరం అంటున్నారు నిపుణులు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసి రిటైర్ అయిన ఐవైఆర్ కృష్ణారావు ఎక్కువగా ఆర్థిక శాఖలో పని చేశారు. అలాగే జగన్‌కు సలహాదారుగా వ్యవహరించి… ఇటీవల రాజీనామా చేసిన పీవీరమేష్ కూడా.. ఆర్థిక శాఖలో ఎక్కువ కాలం పని చేశారు. వీరిద్దరూ… అప్పు కోసం ప్రభుత్వ అనుసరించిన విధానం ఖచ్చితం… కేంద్ర ఆర్థిక నిబంధనలకు.. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమేనని చెబుతున్నారు. ఈ విషయం ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ పరిశీలనకు వెళ్లలేదు. వెళ్తే.. చాలా సీరియస్‌గా తీసుకుంటారని… ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాన్ని కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ అప్పుల కోసం జనం ఆదాయం తాకట్టు వ్యవహరంలో ఉన్న అధికారులు జైలుకు పోయే ప్రమాదం కూడా ఉందంటున్నారు.
సాధారణంగా అధికారులు తప్పులు చేసి జైలుకెళ్తారు. కానీ ఏపీలో అర్థిక శాఖ అధికారులు అప్పులు చేసి జైలుకెళ్లే పరిస్థితి వస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ప్రస్తుతానికి కేంద్రం మద్దతు రాష్ట్రానికి ఉందని.. ఇలాంటి తప్పులు పెద్దగా పరిగణనలోకి తీసుకోరనే నమ్మకం అధికారవర్గాల్లో ఉంది. కానీ రాజకీయంగా ఎంత సన్నిహిత సబంధాలున్నప్పటికీ.. రాజ్యాంగ ఉల్లంఘనలను చూస్తూ ఎంతో కాలం ఉండటం సాధ్యం కాదన్న అభిప్రాయం… వినిపిస్తోంది. ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చింది. అసలు విషయాలు మొత్తం వెల్లడైతే.. సంచలనం రేగడం ఖాయంగా కనిపిస్తోంది.