వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రాజకీయ శైలి ఇంకా చాలా మందికి అర్థం కావడం లేదు. ఆయన టార్గెట్లు చాలా లాంగ్ రేంజ్లో ఉంటాయి. చిరంజీవి ప్రతీ చిన్న విషయాన్ని ఎంత పొగుడుతున్నా…. పవన్ వదిలి పెట్టలేదు. వకీల్ సాబ్ వివాదంతో ఇది ఒక్క పవన్ కల్యాణ్‌కు సంబంధించిన అంశం అని చాలా మంది అనుకుంటారేమో కానీ.. కాస్త విశాలంగా ఆలోచిస్తే… మెగా ఫ్యామిలీని ఆర్థికంగా చాలా తీవ్రగా దెబ్బకొట్టినట్లు సులువుగానే అంచనా వేసుకోవచ్చు. దీనికి లెక్కలు… సమీకరణాలు వేయాల్సిన అవసరం లేదు… రాబోయే రోజుల్లో రాబోతున్న మెగా హీరోల సినిమాలు.. వాటి కలెక్షన్లపై పడే ప్రభావం అంచనా వేస్తే చాలు.
వచ్చే నెల పధ్నాలుగో తేదీన చిరంజీవి ఆచార్య రానుంది. ప్రస్తుత రోజుల్లో ఏ సినిమా రన్నింగ్ అయినా రెండు వారాలే. ఈలోపు వచ్చే కలెక్షనే.. కలెక్షన్. ఈ రెండు వారాల్లో కలెక్షన్ నియంత్రించడం అంటే… సగం ఆదాయాన్ని కోల్పోయినట్లే. ఆచార్యకు పెద్ద ఎత్తున బెనిఫిట్ షోల ద్వారా టిక్కెట్ రేట్ల పెంపు ద్వారా ఆదాయం ఆశిస్తూ ఉంటారు. ఇప్పుడు అది లేదు. వకీల్ సాబ్‌కు మొదటి రోజు ఒక్క కృష్ణా జిల్లాలో రెండు కోట్ల ఆదాయం తగ్గిపోయిందంటే… ఎంత తీవ్రంగా ఆర్థిక నష్టానికి గురయి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. రేపు ఆచార్య పరిస్థితి కూడా అంతే. తర్వాత రాబోయే… పుష్ప అయినా అంతే.
ఒక్క మెగా ఫ్యామిలీ మాత్రమే కాదు.. ఇండస్ట్రీలోని పెద్ద హీరోలంతా ఎఫెక్ట్ అవుతారు. అందులో సందేహం లేదు. అయితే వైసీపీతో సన్నిహితంగా ఉండి నష్టపోయేవారు ఎవరూ లేరు. నాగార్జున సినిమాలకు ఓపెనింగ్స్ ఉండటం లేదు. అఖిల్ సినిమాలకు బెనిఫిట్ షోలు వేసే పరిస్థితి లేదు. ఇతర హీరోలందరూ… అవసరానికి ఏపీ సర్కార్ ను పొడిగినా.. వారికి చిన్న చిన్న అవసరాలే తప్ప… టిక్కెట్ రేట్లు భారీగా పెంచుకునేంత అవసరాలు కావు. కానీ… టిక్కెట్ రేట్లు పరిమితం చేయడం వల్ల వారు కూడా నష్టపోతారు. కానీ వైసీపీకి మాత్రం ఫరక్ లేదు.
వైసీపీ అధినేత… రాజకీయంగా టార్గెట్ చేస్తే వ్యక్తిగతంగా శత్రువులాగానే చూస్తారు. ముందుగా వారి ఆర్థిక మూలాలను దెబ్బకొడతారు. ఏపీలో టీడీపీ నేతలపై జరుగుతున్నరాజకీయం అదే. వారిని ఆర్థికంగా దెబ్బకొట్టే క్రమంలో ఇతరులు నష్టపోతున్నా.. చివరికి తన ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయినా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు పవన్ విషయంలోనూ అంతే. మెగా ఫ్యామిలీని ఆర్థికంగా దెబ్బకొట్టాలనుకుంటున్నారు… మొత్తం ఇండస్ట్రీకే నష్టం వస్తున్నా.. ఆయన పట్టించుకోరని అంటున్నారు. ఇప్పుడు చిరంజీవి ఏం చేస్తారన్నదే చాలా మందికి సమాధానం లేని ప్రశ్న.