మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీలో జగన్ తర్వాత తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో.. జగన్ కన్నా తానే పవర్ ఫుల్ అని చెప్పాలనుకుంటున్నారో కానీ… అప్పుడప్పుడూ… కాస్త తేడా ప్రకటనలు చేస్తున్నారు. గతంలో తానే ముఖ్యమంత్రిని అయితే అసలు టీడీపీని లేకుండా చేసేవాడినని… చెప్పుకొచ్చారు. అంటే జగన్కు చేతకాలేదనా అని ఇతర నేతలు ఆయనపై లోపలలోపల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధిపత్య పోరాటం ప్రారంభించారని అనుకున్నారు. ఇప్పుడు ఆయన మరోసారి జగన్ అనాల్సిన మాట తీసుకున్నారు. తిరుపతిలో టీడీపీ గెలిస్తే… వైసీపీ ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తారని సవాల్ చేశారు. నిజానికి రాజీనామాల గురించిఎవరూ అడగలేదు.
తిరుపతి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు … రిఫరెండంలా భావించి ఓట్లు వేయాలని ఓటర్లను కోరారు. దీన్నే ప్రస్తావించిన పెద్దిరెడ్డి.. రిఫరెండంగా తీసుకోవడానికి వైసీపీ సిద్ధమని… ప్రకటించారు. టీడీపీ గెలిస్తే ఎంపీలందరూ రాజీనామాలు చేసేస్తారని ప్రకటించారు. అదే వైసీపీ గెలిస్తే… టీడీపీకి చెందిన ముగ్గురితో పాటు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కూడా రాజీనామా చేయాలని సవాల్ చేశారు. రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు సహజంగానే ఉంటాయి. ఫలితాలు తేలిన తర్వాత ఎవరూ.. ఆ సవాళ్ల గురించి పట్టించుకోరు. కానీ.. ఇక్కడ సవాల్ చేసిన పెద్దిరెడ్డి.. ఎంపీలందరి తరపున ఎలా ప్రకటన చేస్తారనేది వైసీపీలో మరోసారి గుసగుసలు ప్రారంభమయ్యాయి.
మంత్రి పెద్దిరెడ్డి తనకు లేని పెద్దరికం కల్పించుకుటున్నారని.. జగన్ తర్వాత తానే అని చెప్పుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారని వైసీపీలో కొంత మంది నేతలు అసహనంతో ఉన్నారు. ఆయనదూకుడుగా అడ్డు కట్ట వేయాలన్న ప్లాన్లో హైకమాండ్ ఉందని చెబుతున్నారు. ఇటీవల రోజాకు మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం వైసీపీలో ప్రారంభమయింది. రోజాకు మంత్రి పదవి ఇవ్వాలంటే.. పెద్దిరెడ్డికి చెక్ పెట్టాలి. రెడ్డి సామాజికవర్గానికి ఒకే జిల్లాలో రెండు మంత్రి పదవులు ఇవ్వరు. పెద్దిరెడ్డికి చెక్ పెట్టడానికే ఐదు లక్షల మెజార్టీ బెంచ్ మార్క్ పెట్టారని దాని కన్నా తగ్గితే.. ఆయననే బాధ్యుడ్ని చేస్తారని కూడా చెబుతున్నారు. మొత్తానికి పెద్దిరెడ్డి… కార్నర్లో ఉన్నారని మాత్రం వైసీపీ నేతలు నమ్ముతున్నారు.