ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నేతలపై కేసులు పెట్టడం సహజమే. ముఖ్యంగా సీఐడీ పోలీసులు ఆ విషయంలో చాలా ముందు ఉంటారు. ఎవరో చెబుతున్నట్లుగా చిత్ర విచిత్రమైన కేసులు పెడుతూ ఉంటారు. తాజాగా మాజీ మంత్రి దేవినేని ఉమపై కేసు పెట్టారు. రెండు వర్గాల మధ్య చిచ్చు రాజేసినట్లుగా ఆరోపిస్తూ.. సెక్షన్ 505 కింద కేసు పెట్టారు. అంతగా వర్గాల మధ్య చిచ్చు రాజేసే పని దేవినేని ఉమ ఏం చేశారని అందరూ ఆశ్చర్యపోయారు. కేసు వివరాలు చూస్తే.. అందులో దేవినేని ఉమ ఓ వీడియోను విడుదల చేశారని అది మార్ఫింగ్ అని.. వచ్చిన ఓ ఫిర్యాదు మేరకు ఈ కేసు పెట్టారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో ఉన్న దేవినేని ఉమ.. గతంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటల క్లిప్‌ను మీడియాకు విడుదల చేశారు. తిరుపతిలో చదువుకున్న వారు ఉండటానికి ఇష్టపడరని ఓ సారి జగన్ వ్యాఖ్యానించారని దేవినేని ఉమ చెబుతున్నారు.
నిజానికి అది పాత వీడియో. ఎప్పట్నుంచే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధాని ఎలా ఉండాలో ఉదహరిస్తూ… తిరుపతి గురించి టంగ్ స్లిప్ అయ్యారని ఆ వీడియో క్లిప్‌లో ఉంది. అప్పటి నుంచి ఆ వీడియో సోషల్ మీడియాలో ఉంది. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నిక జరుగుతోందని… దాన్ని టీడీపీ నేతలు మీడియా ముందు ప్రదర్శించారు. ఆ తర్వాత ఈ వీడియో ఇంకా ఎక్కువ సర్క్యూలేట్ అవుతోంది. దీంతో కర్నూలు జిల్లాలోని ఓ వైసీపీ కార్యకర్త… అది మార్ఫింగ్ వీడియో అని ఫిర్యాదు చేశారు. అలా ఫిర్యాదు వస్తుందని .. కేసులు నమోదు చేయాలని ముందుగానే ప్రోగ్రామ్ చేసినట్లుగా పోలీసులు కదిలిపోయారు.
నిజంగా అది మార్ఫింగ్ అయితే.. కర్నూలు జిల్లాలోని కార్యకర్త ఫిర్యాదు చేయాల్సిన పని లేదని.. ముఖ్యమంత్రి వీడియో కాబట్టి ప్రభుత్వమే స్పందించవచ్చని కొంత మంది అంటున్నారు. ఈ కేసుపై దేవినేని ఉమ… మండిపడ్డారు. ప్రతి అమావాస్యకు తనపై కేసులు పెడుతున్నారని …తప్పుడు కేసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. కత్తిపోటుతో చనిపోతే గుండెపోటు అని చెప్పిన విజయసాయిరెడ్డిపై కేసు పెట్టు.. వివేకానంద ఇంట్లో కుక్కకు విషం పెట్టి ఎవరు చంపారో వారిపైనే కేసు పెట్టు.. బాబాయ్ రక్తాన్ని తుడిచిన వారిపైనే కేసు పెట్టు అని జగన్‌కు దేవినేని ఉమ సవాల్ చేశారు.