తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌పై విజయవాడ సైబర్ క్రైం పోేలీసులు అట్రాసిటీ కేసు పెట్టారు. ఇటీవలి కాలంలో చంద్రబాబుపై అట్రాసిటీ కేసు పెట్టడం ఇది రెండో సారి. కొద్ది రోజుల కిందట.. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని అట్రాసిటీ కేసు పెట్టారు. ఇప్పుడు… వైసీపీ ముఖ్యనేతలు నేరుగా డీజీపీని కలిసి… టీడీపీ ఫేస్బుక్ పేజీలో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని కించపరుస్తూ పోస్ట్ పెట్టారని కేసు పెట్టాలని ఫిర్యాదు చేశారు. దానిపై డీజీపీ ఆదేశాల మేరకు.. విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ ఫేస్బుక్ పోస్టింగ్‌కు… చంద్రబాబు, లోకేష్‌కు సంబంధం … ఏమిటంటే.. అది టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో ఉండటమేనట.
వృత్తిపరంగా ఫిజియోధెరపిస్ట్ అయిన గురుమూర్తి జగన్‌కు చాలా కాలంగా సేవలు అందిస్తున్నారు. ఈ సందర్భంగా జగన్ ఆయన సేవలను మెచ్చి తిరుపతి టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రకటన చేస్తూ.. వైసీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో గురుమూర్తి గురించి ఓ ఫోటో పెట్టారు. జగన్ కాళ్లు బార్లా చాపి ఇవ్వగా.. ఆయన కాలును తన తొడపై పెట్టుకుని సపర్యలు చేస్తున్న ఫోటో అది. అప్పట్లోనే వైరల్ అయింది. జగన్ పాద సేవ చేసే వ్యక్తిని ఎంపీని చేస్తే ప్రజలకు ఏం మేలు చేస్తారని ప్రశ్నిస్తూ.. టీడీపీ సోషల్ మీడియా విభాగం పోస్ట్ పెట్టింది. ఇది వైరల్ కావడంతో వైసీపీ నేతలకు కోపం వచ్చింది. వెంటనే ఆ పోస్టింగ్ పట్టుకుని డీజీపీ వద్దకు వెళ్లారు. చంద్రబాబు, లోకేష్‌పైనే కేసు పెట్టాలని కోరారు. డీజీపీ వారి కోరిక నెరవేర్చారు.
విశేషం ఏమిటంటే… ఆ ఫోటో మార్ఫింగ్ అని వైసీపీనేతలు చెబుతున్నారు. అందుకే… టీడీపీ నేతలు రివర్స్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫోటో వైసీపీ అధికారికంగా విడుదల చేసినందున జగన్, సజ్జలపై కూడా కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ ప్రస్తుతం పోలీసులు వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదులపైనే స్పందిస్తున్నారు. అంటే వారి కోసం మాత్రమే పని చేస్తున్నారు. సాధారణ ప్రజల కోసం కానీ… టీడీపీ నేతల ఫిర్యాదులపై కానీ స్పందించే పరిస్థితి లేదు. గతంలో తిరుపతిని కించ పరుస్తూ జగన్ మాట్లాడిన వీడియోను ప్రదర్శించినందుకు మార్ఫింగ్ అంటూ దేవినేని ఉమపై ఒక రోజు ముందే కేసు పెట్టారు.