తెలంగాణ మంత్రి కేసీఆర్‌కు కోపం వచ్చింది. తన తండ్రి కేసీఆర్ హోదా, వయసును కూడా పరిగణనలోకి తీసుకోకుండా విపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాతున్నారంటూ వరంగల్‌లో ఆయన ఫైరయ్యారు. ఇదే చివరి వార్నింగ్ అని విపక్ష నేతలకు స్పష్టం చేసింది. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే.. మోడీ, అమిత్ షాలను కూడా వదిలి పెట్టకుండా మాట్లాడతామని హెచ్చరించారు. కేసీఆర్ ఆవేశానికి కారణం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన ఎక్కడా దూకుడు తగ్గడం లేదు. భాషలో కేసీఆరే తన గురువు అని.. తాను గురుదక్షిణ సమర్పించుకుంటానంటూ ఆయన చెలరేగిపోతున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా వారికి కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. కాంగ్రెస్ నేతలు ఏమైనా అంటే.. వారిపై దూకుడుగా చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ సర్కార్ రెడీగా ఉంటుంది. కానీ బీజేపీ విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. మాటలతోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాటల ద్వారా బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో టీఆర్ఎస్ లేదు. నిజంగా బండి సంజయ్ తరహాలో విరుచుకుపడాలంటే టీఆర్ఎస్ దగ్గర భాషా పండితులు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరూ బీజేపీపై ఘాటు భాష ఉపయోగించకూడదన్న సంకేతాలు హైకమాండ్ నుంచి వచ్చాయి. అందుకే చాలా రోజుల నుంచి టీఆర్ఎస్ నేతలు సంయమనం పాటిస్తున్నారు.
అయితే టీఆర్ఎస్ నేతల సంయమనం… చేతకానితనంగా బీజేపీ నేతలు పరిగణనలోకి తీసుకుంటున్నారు. అందుకే వారు జోరు పెంచుతున్నారు. ఇప్పుడు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. చివరి సారిగా చెబుతున్నానని కూడా హెచ్చరించారు. బండి సంజయ్ మళ్లీ కేసీఆర్ పై తన పాత లాంగ్వేజ్‌లోనే విరుచుకుపడతారా.. కేటీఆర్ వార్నింగ్ ను చూసి ఆగిపోతారా అన్నది ఆసక్తికరమే. అయితే బండి సంజయ్ అలా ఆగకపోతే.. కేటీఆర్ ఏం చేస్తారన్నది కూడా ఆసక్తికరమే. సాగర్ ఎన్నికల ఫలితం తర్వాత ఈ రాజకీయం మరింత రాజుకునే అవకాశం ఉంది.