పవన్ కళ్యాణ్ మూడేళ్ల తర్వాత తీసిన వకీల్ సాబ్ సినిమాకు ప్రజల నుండి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. కరోనా దెబ్బకు గత ఏడాదంతా కుదేలైపోయిన సినీ పరిశ్రమ కి, ఈ ఏడాది మొదట్లో హిట్ అయిన క్రాక్ , ఉప్పెన వంటి సినిమాలు 2021 లో సినీ పరిశ్రమ కోలుకుంటుందన్న నమ్మకాన్ని కలిగించాయి. ఇక తాజాగా విడుదలైన వకీల్ సాబ్ కి మొదటిరోజు మొదటి ఆట నుండి సూపర్ హిట్ టాక్ రావడంతో ఈ ఏడాది సినీ పరిశ్రమ పూర్తి స్థాయిలో పుంజుకుంటుందన్న నమ్మకం సినీ పరిశ్రమకు కలిగింది. సరిగ్గా అదే సమయంలో సినీ పరిశ్రమ మొత్తాన్ని పూర్తి స్థాయిలో చావు దెబ్బతీసే రీతిలో జగన్ తీసుకున్న తాజా నిర్ణయం సినీ పరిశ్రమను విస్మయపరిచింది. జగన్ తీసుకువచ్చిన జీవో తెలుగు పరిశ్రమ నడ్డి విరిచేది గా ఉందన్న అభిప్రాయం పరిశ్రమలో వినిపిస్తోంది.
సినిమా టికెట్ ధర తగ్గింపు కోసం అహర్నిశలు కష్టపడ్డ ప్రభుత్వం:
వకీల్ సాబ్ విడుదల ముందు రోజు, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం ఆగమేఘాలమీద జీవో లను తీసుకొచ్చింది . హైకోర్టు టికెట్ ధరలు కొంతకాలం పెంచుకోవడానికి అనుమతిస్తే, దానిమీద డివిజన్ బెంచ్ కు వెళ్లారు. తమ పంతాన్ని సాధించుకునే దాకా అన్ని రకాలుగా గట్టి ప్రయత్నాలు చేసి, కోర్టు నుండి ఎటువంటి అడ్డంకులు రాకుండా పకడ్బందీగా వ్యవహరించి చివరికి జీవో విడుదల చేశారు. ఈ జీవో ప్రకారం, మల్టీప్లెక్స్ లలో సైతం గరిష్టంగా 80 రూపాయలకు మించకుండా టిక్కెట్లను అమ్మవలసి ఉంటుంది. ఇక సి సెంటర్ లో ఎకనమీ తరగతి సినిమా టికెట్ కనీస ధర 5 రూపాయలుగా జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. నిజానికి ప్రజా క్షేమం దృష్టిలో ఉంచుకుని టికెట్ ధరలు తగ్గించి ఉంటే అందరూ హర్షించి ఉండేవారేమో కానీ, గత వారం విడుదలైన వైల్డ్ డాగ్ వంటి సినిమాలకు నూట యాభై రూపాయల వరకు టికెట్ అమ్ముకునే వెసులుబాటు ఉండగా, వారం తిరగగానే పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అయిన వెంటనే టికెట్ ధరలు తగ్గించడానికి ప్రభుత్వం అహర్నిశలు కష్ట పడటం తో, ఇది రాజకీయ కక్ష సాధింపే అన్న అభిప్రాయం ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.
ఏడాదిన్నర జగన్ పాలనలో ధర తగ్గించిన ఏకైక ఐటమ్ సినిమా టికెట్ మాత్రమే అని నెటిజన్ల చురకలు:
దీంతో పాటు సోషల్ మీడియా వేదికల్లో కూడా జగన్ నిర్ణయం పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాదిన్నర పైగా జరిగిన జగన్ పాలనలో, నిత్యావసర వస్తువుల తో పాటు అనేక వస్తువుల ధరలు దారుణంగా పెరిగాయి. ప్రత్యేకించి మద్యం ధరలు మూడు రెట్లు పెరిగాయి. పెట్రోలు డీజిల్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధిస్తున్న రాష్ట్ర టాక్స్ కూడా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువే. కందిపప్పు మొదలుకొని వంట నూనె వరకు, ఇసుక నుండి సిమెంట్ వరకు ప్రతి సరకు ధర 20 శాతం నుండి 80 శాతం వరకు పెరిగాయి. అంతవరకు ఎందుకు జగన్ సొంత వ్యాపారం అయిన భారతి సిమెంట్ ధర గత ఏడాదిన్నర లో 30 శాతం పైగానే పెరిగింది. ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క వస్తువు ధర తగ్గించలేకపోయిన జగన్, కేవలం సినిమా టికెట్ ధరలు తగ్గించడానికి ఇంత బలంగా ప్రయత్నించడం తో ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యే అన్న అభిప్రాయం కలుగుతోంది.
వకీల్ సాబ్ మాత్రమే కాదు సినీ పరిశ్రమ మొత్తాన్ని నడ్డివిరిచే చర్య ఇది:
నిజానికి వకీల్ సాబ్ సినిమా పై జగన్ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు కారణంగా జరిగే నష్టం వకీల్ సాబ్ బృందంపై కంటే కూడా మిగతా వారిపై ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాకు పవన్ పారితోషకం పవన్ కు ఎప్పుడో అంది ఉంటుంది. నిర్మాతలు ఇప్పటికే తన సినిమాను డిస్ట్రిబ్యూటర్లకు, బయ్యర్లకు అమ్మి ఉంటారు. జగన్ నిర్ణయం కారణంగా నష్టపోయేది ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు మాత్రమే. ఇప్పటికే ఓటీటి కారణంగా చితికిపోతున్న ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు జగన్ దెబ్బకు కుదేలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. వకీల్ సాబ్ సినిమా తో పాటు మరి కొద్ది నెలల్లో రానున్న అన్ని తెలుగు సినిమాల పై జగన్ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపనుంది. సినీ పరిశ్రమ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి బతికే వేలాది జీవితాలు భవిష్యత్తులో రోడ్డున పడే అవకాశం కనిపిస్తోంది. ఇదంతా తెలిసి కూడా జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం కేవలం భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ తో సినిమాలు తీసే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల ని భయపెట్టడానికి మాత్రమే అని పవన్ కళ్యాణ్ అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటికే షూటింగ్ లో ఉన్న భారీ సినిమాలకు జగన్ తాజా నిర్ణయం ముచ్చెమటలు పట్టిస్తోంది.
(సశేషం)