తిరుపతిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న చంద్రబాబు ప్రచార వాహనంపై దండగులు రాళ్లు విసిరారు. ఇద్దరు ముగ్గురు యువకులు వరుసగా రాళ్లు రువ్వడంతో అవి చంద్రబాబు ప్రచార వాహనం సమీపంలో పడ్డాయి. ఇద్దరు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పోలీసులే దగ్గరుండి రాళ్లు రువ్వించారని.. రౌడీరాజ్యం నశించాలంటూ నినాదాలు చేశారు. తక్షణం నిందితుల్ని పట్టుకోవాలంటూ.. రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా… తిరుపతి కృష్ణాపురం జంక్షన్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.
ఆందోళన చేయవద్దని.. పోలీసులు చంద్రబాబును కోరారు. రాళ్లేసిన వాళ్లను ఎందుకు పట్టుకోలేదని చంద్రబాబు వారిపై మండిపడ్డారు. జడ్ ప్లస్ కేటగిరి భద్రత ఉన్న తనకే పోలీసులు రక్షణ కల్పించడం లేదని ఇక సామాన్యులుక ఎలా రక్షణ కల్పిస్తారని చంద్రబాబు మండిపడ్డారు. రౌడీ యిజానికి భయపడే ప్రశ్నే లేదని.. తన ఎదుటకు రావాలని చంద్రబాబు సవాల్ చేశారు. బాంబులకే భయపడలేదని… రాళ్లదాడులకు ఎలా భయపడతానని ప్రశ్నించారు. కాసేపు రోడ్డుపై బైఠాయించిన తర్వాత ఎస్పీ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. తనపై దాడి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తారు. రాళ్ల దాడి ఘటనపై టీడీపీ తీవ్రంగా స్పందించింది. ఓ వైపు ఈసీకి ఫిర్యాదు చేసింది.
మరో వైపు గవర్నర్‌ను కలవడానికి టీడీపీ ప్రతినిధుల బృందం వెళ్లింది. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను సహించేది లేదని … ప్రతిపక్షంపై కేసులు పెట్టడమే కాదు.. ఇలా రౌడీయిజం ద్వారా కూడా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. రాళ్ల దాడి ఘటనలో నిందితుల్ని పోలీసులు పట్టుకోకపోతే.. వారిపైనే మరింత అనుమానాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పోలీసులే దగ్గరుండి రాళ్లేయించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.