తిరుపతి ఉపఎన్నికల్లో భద్రత కోసం కేంద్ర బలగాలను ఉపయోగించాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. చంద్రబాబు ప్రచారంలో జరిగిన రాళ్ల దాడి వ్యవహారంతో ఈ విషయాన్ని మరింత సీరియస్గా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. తిరుపతి ప్రచారం లో తీరిక లేకుండా ఉన్న ముగ్గురు టీడీపీ ఎంపీలు… ప్రత్యేకంగా ఇదే అంశంపై… ఈసీతో మాట్లాడేందుకు హుటాహుటిన ఢిల్లీ వెళ్తున్నారు. సీఈసీగా … ఇప్పటి వరకూ ఉన్న సునీల్ అరోరా రిటైర్ అయ్యారు. కొత్త సీఈసీగా సుశీల్ చంద్ర నియామకం అయ్యారు. ఆయన ఈ రోజు బాధ్యతలు చేపడుతున్నారు. ఆ తర్వాత ఆయనను కలవనున్నారు. కేంద్ర బలగాల కోసం .. ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ.. ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది.
స్థానిక ఎన్నికల్లో తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమాల విషయంలో గతంలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ … కేంద్ర హోంశాఖకు లేఖ రాశారు. ఆ లే్ఖ ఇప్పుడు ప్రధాన ఆయుధంగా టీడీపీకి ఉపయోగపడే అవకాశం ఉంది. స్థానిక ఎన్నికల్లోనే అన్ని అక్రమాలకుపాల్పడిన అధికార పార్టీ.. పోలీసుల అండతో లోక్సభ ఎన్నికల్లోనూ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వారు సీఈసీ దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఎన్నికలు జరగాలని గట్టిగా డిమాండ్ చేసే అవకాశం ఉంది.
జరుగుతోంది లోక్సభ ఎన్నికలు కాట్టి.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏ మాత్రం డౌట్ వచ్చినా రాష్ట్ర పోలీసుల కన్నా ఎక్కువగా కేంద్ర బలగాలను మోహరించే అవకాశం ఉంది. ఎస్ఈసీ విషయంలో అయితే… ఎలాంటి హోప్స్ టీడీపీ పెట్టుకునేది కాదు. కానీ ఇక్కడ సీఈసీ కాబట్టి… టీడీపీ ఈ విషయంలో ఆశాభావంతో ఉంది. ఇటీవల తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందు కోసం పెద్ద ఎత్తున బలగాలు అక్కడకు చేరుకున్నాయి. అక్కడ్నుంచి కొన్ని బలగాలను తిరుపతికి పంపించవచ్చని టీడీపీ నమ్మకంతో ఉంది.