ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రైవేటు సంభాషణలను స్టింగ్ ఆపరేషన్ పేరుతో కొంత మంది సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఆ వీడియోలను వైసీపీ అనుకూల మీడియా విస్తృతంగా సర్క్యూలేట్ చేస్తోంది. ప్రధానంగా ఆ వీడియోలను చూస్తే… చంద్రబాబు, లోకేష్‌కు అచ్చెన్నాయుడు మధ్య దూరం పెంచేలా ఉండే కొన్ని సంభాషణలను ప్రత్యేకంగా అందులో ఉంచినట్లుగా స్పష్టమవుతోంది. భోజనం చేస్తూ.. తనతో మాట్లాడటానికి వచ్చిన వారితో అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో అది. అందులో అచ్చెన్నాయుడుతో తన గోడు చెప్పుకోవడానికి వచ్చిన ఓ వ్యక్తి.. తన ఫోన్ ఎత్తడం లేదని… ముఫ్పై ఏళ్లు సర్వీస్ చేశానని… చెప్పుకొచ్చారు. అచ్చెన్నాయుడు కూడా పదిహేడో తేదీన ఎన్నికలు అయిపోతాయని.. తర్వాత ఫ్రీ అయిపోతామన్నారు.
తర్వాత ఏ సందర్భంలో అన్నారో కానీ.. పార్టీ లేదు.. బొక్కా లేదు అనే వాయిస్ కూడా వచ్చింది. ఉప ఎన్నిక పోలింగ్ కు మూడు రోజుల ముందు ఈ వీడియో బయటకు రావడం…కుట్రపూరితంగా వైసీపీ పన్నిన పన్నాగంగా టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ వీడియోపై అచ్చెన్నాయుడు స్పందించారు. ఎన్ని కుట్రలు పన్నినా.. తిరుపతిలో తెలుగుదేశం విజయాన్ని ఆపలేరని.. చంద్రబాబు, లోకేష్‌తో తనుకున్న అనుబంధాన్ని తగ్గించలేరని స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు ప్రైవేటుగా ఎలా మాట్లాడతారో పార్టీలో ఉన్న వారందరికీ తెలుసు.
అదే సమయంలో టీడీపీపై ఆయన నిబద్ధతను కూడా ఎవరూ శంకించలేరని ఆ పార్టీలో నేతలు చెబుతూ ఉంటారు. ఉద్దేశపూర్వకంగా ప్రైవేటుగా మాట్లాడిన సంభాషణలను ఎడిటింగ్ చేసి.. తిరుపతి ఉపఎన్నిక ముందు బయట పెట్టి… టీడీపీలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి అప్రమత్తంగా లేకుండా స్టింగ్ ఆపరేషన్‌కు చాన్సిచ్చిన అచ్చెన్నాయుడుకు ఇది ఇబ్బందికరమే.