విశాఖలో రెండు వేర్వేరు ఘటనల్లో పది మంది చనిపోవడం… కలకలం రేపుతోంది. ఈ పది మంది రెండు వేర్వేరు కుటుంబాలకు చెందినవారు. ఓ కుటుంబంలో ఆరుగుర్ని పాత కక్షలతో ఓ వ్యక్తి నరికి చంపేశారు. మరో కుటుంబంలో నలుగురు అనుమానాస్పద స్థితిలో సజీవ దహనమయ్యారు. అయితే ఎవరో కావాలనే ఇంటికి నిప్పుపెట్టి సజీవదహనం చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు.
విశాఖలో అత్యంత పోష్ అపార్టుమెంట్లలో ఒకటిగా పేర్కొన్న ఆదిత్య ఫార్ట్యూన్ అపార్టుమెంట్లోని ఐదో అంతస్తులోని 505 ఫ్లాట్లో ఒక్క సారిగా మంటలు రావడంతో చుట్టుపక్కల వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చే సరికి… పూర్తిగా ఫ్లాట్ తగలబడిపోయింది. అందులో ఉన్న నలుగురు సజీవ నదహనం అయ్యారు. భర్త, భార్యతో పాటు ఇద్దరు పిల్లలు బుగ్గి అయిపోయారు. ఇంటిపెద్ద పేరు బంగారునాయుడు కాగా.. భార్య పేరు నిర్మల. ఇద్దరు కుమారులు కూడా కాలిపోయారు. అనుమానాస్పద స్థితికి కింద కేసు నమోదు చేశారు. వారికి ఆర్థిక సమస్యలేమీ లేవని… పోలీసులు గుర్తించారు. కుటుబంలో గొడవలు ఉన్నాయని.. ఘటన జరగడానికి ముందు ఘర్షణ జరిగిందని… పోలీసులు గుర్తించారు. ఆ ఘర్షణ కుటుంబంోని వారు పడ్డారా.. బయట వ్యక్తులతో పడ్డారా అన్నదానిపై విచారణ జరుపుతున్నారు. ఆ తర్వాతే కేసు మిస్టరీ వీడే అవకాశం ఉంది.
మరో ఘటనలో… అప్పలరాజు అనే వ్యక్తి… పాత కక్షలను కసిగా మార్చుకుని వేటకత్తితో ఓ కుటుంబంలో ఆరుపై దాడి చేశారు. ముక్కలు ముక్కలుగా నరికేశాడు. పెందుర్తి సమీపంలోని జుత్తాడలో ఈ ఘటన చోటు చేసుకుంది. బొమ్మిడి రమణ అనే కుటుంబం గాఢనిద్రలో ఉన్న సమయంలో వేటకత్తితో అప్పలరాజు విరుచుకుపడ్డారు. ఆరు నెలల వయసు ఉన్న పసికందు సహా ఎవర్నీ వదిలి పెట్టలేదు. దొరికినవారిని దరికినట్లుగా నరికాడు. మొత్తం ఆరుగురు చనిపోయారు. వారి శరీర భాగాలు చెల్లాచెదురుగా పడ్డాయి. హత్యల తర్వాత అప్పలరాజు నేరుగా వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పాత కక్షల కారణంగానే ఇలాంటి దారుణానికి అప్పలరాజు పాల్పడ్డాడని… పోలీసులు అనుమానిస్తున్నారు.
విశాఖ ప్రశాంతమైన సిటీ. అక్కడి ప్రజలు ప్రశాంత జీవనానికే ఇష్టపడతారు. నరుక్కుని చంపుకోవడాల్లాంటి ఆలోచనలు చేయరు. కానీ ఇటీవల అక్కడ కూడా నేర ప్రవృత్తి పెరిగిపోతోందని.. తాజా ఘటనలు నిరూపిస్తున్నాయి. ఆరుగుర్ని అత్యంత దారుణంగా నరికిచంపడమే కాదు.. మరో నలుగుర్ని పాశవికంగా సజీవ దహనం చేశారు. ఈ ఘటనలు విశాఖ వాసుల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.