నిరుద్యోగుల కోసం షర్మిల తలపెట్టిన దీక్ష సందర్భంగా నాటకీయ పరిణామాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆ పరిణామాల అనంతరం మాట్లాడిన షర్మిల తన మనస్సులో మాట బయట పెట్టుకున్నారు. ఏదో ఒక రోజు తాను తెలంగాణకు సీఎం అవుతానని ప్రకటించుకున్నారు. తాను సీఎం అయితేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని ఆవిడ అన్నారు. వివరాల్లోకి వెళితే..
తెలంగాణకు సీఎం అవుతాను అంటూ కోరిక బయటపెట్టుకున్న షర్మిల:
తెలంగాణ లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, కెసిఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగుల తరఫున షర్మిల దీక్ష ప్రకటించారు.మూడు రోజులపాటు చేయాలనుకున్న దీక్షకు పోలీసులు ఒక రోజుకు మాత్రమే అనుమతి ఇచ్చారు. అయితే అనుమతించిన సమయం దాటిన తర్వాత కూడా షర్మిల దీక్ష ముగించిన పోవడంతో పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ఆ సందర్భంగా కాస్త తోపులాట జరిగింది.
ఆ తర్వాత షర్మిల మీడియాతో ఆవేశంగా మాట్లాడారు. నిరుద్యోగుల సమస్యపై దీక్ష చేస్తే అరెస్టులు చేయడం ఏంటంటూ ఆవిడ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చిన తర్వాత కెసిఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆవిడ విమర్శించారు. తోపులాటలో కొంతవరకు చిరిగిపోయిన వస్త్రాలతో అలాగే మీడియా ముందు కూర్చున్నారు. కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తను తెలంగాణకు సీఎం అవుతానని ఆవిడ ప్రకటించారు. తాను సీఎం అయితే తప్ప బంగారు తెలంగాణ సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగుల దీక్ష సందర్భంగా సీఎం అవ్వాలనే తన మనసులోని కోరికను ఆవిడ స్వయంగా బయటపెట్టుకున్నారు.
అప్పట్లో తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర పడ్డ వైఎస్ రాజశేఖరరెడ్డి:
ఏది ఏమైనా షర్మిల రాజకీయ ప్రస్థానం ప్రజలకు ఆసక్తి కలిగిస్తోంది. నేను తెలంగాణకు అడ్డం కాదు నిలువు కాదు అని అప్పట్లో రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది. ఒకవేళ తెలంగాణ ఏర్పాటు అయితే హైదరాబాద్ కు వెళ్లాలంటే ఆంధ్రులు వీసా తీసుకుని వెళ్లాల్సి ఉంటుందని రాజశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా తెలంగాణ వాసులకు ఇప్పటికీ గుర్తే. రాజశేఖర్ రెడ్డి చనిపోక పోయి ఉంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని ఇటు ఆంధ్రుల తో పాటు తెలంగాణ వాసులు కూడా బలంగా విశ్వసిస్తుంటారు. సంజయ్ బారు వంటి బ్యూరోక్రాట్లు తమ పుస్తకాలలో కూడా ఇదే విషయాన్ని రాసిన సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుంది. ఏదిఏమైనా ఇదంతా గతం.
షర్మిల వ్యాఖ్యలకు మిశ్రమ స్పందన:
ఇవాల్టి కార్యక్రమంపై నెటిజన్ల స్పందన కూడా మిశ్రమంగా ఉంది. షర్మిల చేసిన కార్యక్రమానికి వేలాదిగా జనం తరలివచ్చారని, షర్మిల రాజకీయ ప్రస్థానం బలంగా ఉంటుందని కొందరు వ్యాఖ్యానిస్తే, వేల కోట్ల డబ్బులు ఉంటే ఎవరైనా రాజకీయం చేయొచ్చని షర్మిల నిరూపిస్తున్నారు అని, మీడియా మేనేజ్మెంట్ కోసం, జనాలని తరలించడం కోసం మొదటి రోజు నుండి షర్మిల డబ్బులు ధారాళంగా బయటకు తీస్తున్నారని మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకొందరు మాత్రం నిజంగా ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడాల్సి వస్తే, జగన్ పాలనలో కెసిఆర్ పాలన కంటే కూడా తక్కువగా ఉద్యోగాలు వచ్చాయని, దాని గురించి షర్మిల ఎందుకు మాట్లాడరని, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డీఎస్సీ ఇలాంటి ఒక్క నోటిఫికేషన్ కూడా జగన్ ఇప్పటి వరకు వేయలేకపోయారు అని, ఉద్యోగాలకు యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏడాది క్యాలెండర్ ప్రకటిస్తానని చెప్పి జగన్ అధికారంలోకి వచ్చారని, కానీ ఇప్పటివరకు ఉద్యోగాల క్యాలెండర్ ఊసే లేదని వారు గుర్తు చేస్తున్నారు. వాలంటీర్ల పేరిట కార్యకర్తలకు డబ్బులు ఇస్తూ అవే ఉద్యోగాలు అనుకోమంటున్నారని, డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది ఆంధ్ర విద్యార్థుల కోసం షర్మిల నోరు మెదపడం లేదని వారు అంటున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే కొందరు మాత్రం, కెసిఆర్ వైపు ఉన్న మైనారిటీ వర్గాల ఓట్లను, రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చడానికి బిజెపి యే షర్మిలను తెర మీదకు తీసుకు వచ్చిందని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
తాను పార్టీ ప్రకటించిన రోజే పాదయాత్ర తేదీని సైతం ప్రకటిస్తానని షర్మిల ఇవాళ ప్రకటించారు. మరి అప్పట్లో తెలంగాణ ఉద్యమాన్ని తొక్కేసిన వైయస్సార్ కూతురిని కూడా ఆదరించి తెలంగాణ వాసులు తమ పెద్ద మనసు చాటుకుంటారా లేక ధన బలం, మీడియా బలం తో చేసే రాజకీయాలు తెలంగాణలో సాగవని నిరూపిస్తారా అన్నది వేచిచూడాలి.