వైసీపీ గౌరవాధ్యక్షురాలికి కాలం అంతగా కలసి రావడం లేదు. వైసీపీకి గౌరవాధ్యక్షురాలిగా ఉండి.. మరో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంటే.. తాజాగా షర్మిలపై తెలంగాణ పోలీసులు వ్యవహరించిన తీరును ఖండించిన వైనం విషయంలోనూ ఆమెపై విమర్శలు దూసుకొస్తున్నారు. విజయలక్ష్మి .. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి తల్లి అని.. గత ఏడాదిన్నరగా ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని మహిళా రైతులపై పోలీసులు జరుపుతున్న దాష్టీకాలు కనిపించలేదా అని అక్కడి రైతులు ప్రశ్నించడం ప్రారంభించారు. హైదరాబాద్‌లో పాదయాత్ర చేస్తూ వస్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతిలేదని.. చెప్పి బలవంతంగా పోలీస్ వాహనంలో తీసుకొచ్చి లోటస్ పాండ్‌లో వదిలి పెట్టారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కింద పడ్డారు. జాకెట్ చినిగిపోయింది.
ఈ ఘటన చూసి తల్లి విజయలక్ష్మి ఆవేదన చెందారు. మీడియా ముందుకు వచ్చి తెలంగాణ పోలీసులపై మండిపడ్డారు. కేసీఆర్‌పైనా సీరియస్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలు చేసిన సమయంలో.. ఏపీలో అందరికీ… అమరావతి మహిళా రైతులే గుర్తుకు వచ్చారు. అమరావతి కోసం పోరాడుతున్న మహిళా రైతులపై పోలీసులు జరిపి దాష్టీకాలు అన్నీ ఇన్నీ కావు. కొట్టారు.. తిట్టారు.. కేసులు పెట్టారు. అవి జాతీయ మానవహక్కుల సంస్థ వరకూ వెళ్లాయి. కానీ ఎప్పుడూ కూడా.. వారంతా ఆడవాళ్లే అని కానీ వారిలో చాలా మంది వైసీపీకి ఓట్లేసిన వాళ్లే అయినా కానీ.. పట్టించుకోలేదు. కనీసం పోలీసులు అలా చేయడం కరెక్ట్ కాదని ఎవరూ స్టేట్ మెంట్ ఇవ్వలేదు.
షర్మిల కూతురనే స్పందించారా.. ఆంధ్రప్రదేశ్ అమరావతి మహిళా రైతుల పట్ల కనీస బాధ్యత లేదా.. అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మహిళా రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఒక్క సారైనా తమ కుమారుడికి చెప్పారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి రాజకీయాలకు సంబంధం లేకపోయినా పిల్లల కోసం.. రెండు పార్టీల కోసం పని చేస్తున్న విజయలక్ష్మికి సమాదానం చెప్పుకోలేని ప్రశ్నలు ఎదురొస్తున్నాయి.