ప్రధానమంత్రి నరేంద్రమోడీ చొరవతో సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఇంటర్ పరీక్షల్ని అంటే పన్నెండో తరగతి పరీక్షల్ని వాయిదా వేసింది. మోడీనే అలాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత మనం మాత్రం ఎందుకు విద్యార్థులను రిస్క్‌లో పెట్టడం అని..తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అదే తరహా నిర్ణయం తీసుకన్నారు. టెన్త్ పరీక్షలు రద్దు చేశారు. ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేశారు. దేశంలోని దాదాపుగా అన్ని రాష్ట్రాలు అదే పనిలో ఉన్నాయి. కానీ.. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం… పరీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటనలు చేస్తున్నారు.
వాస్తవానికి… కరోనా రోజు రోజుకు ఉద్ధృతం అవుతున్నప్పటికీ.. ఏపీలో ఇప్పటికీ స్కూళ్లు నిర్వహిస్తున్నారు. వైరస్ బయటపడిన స్కూళ్లలో ఒకటి, రెండు రోజులు సెలవులు ఇచ్చి మళ్లీ కొనసాగిస్తున్నారు. దీంతో కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య.. టీచర్ల సంఖ్య పెరుగుతోంది. గుంటూరులో ఓ ప్రభుత్వ స్కూళ్లో ఇద్దరు టీచర్ల కరోనాతో చనిపోయారు. పరిస్థితి వరస్ట్‌గా మారుతోందని… తెలిసి కూడా ప్రభుత్వం మంకుపట్టు వీడటం లేదు. కనీసం తరగతుల నిలిపివేత నిర్ణయం తీసుకోకపోగా.. పరీక్షలు నిర్వహించి తీరుతామని విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ రోజూ ప్రకటిస్తున్నారు.
సీఎం జగన్ సారధ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని పరీక్షలు నిర్వహిస్తామని చెబుతున్నారు. కరోనా జాగ్రత్తలు సీఎం కాదు.. పీఎం ఆధ్వర్యంలో తీసుకున్నా… ముప్పు పొంచే ఉంటుందన్న ఉద్దేశంతోనే సీబీఎస్ఈ సహా అన్ని విద్యా బోర్డులు పరీక్షల విషయంపై నిర్ణయం తీసుకుంటే.. ఏపీలో మాత్రం విద్యార్థులను రిస్క్‌లో పెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.